ముంబై నగరానికి ఏమైంది ? ప్రజలు ఇంట్లో ఉండలేరు..బయటకు రాలేరు

  • Published By: madhu ,Published On : August 6, 2020 / 10:38 AM IST
ముంబై నగరానికి ఏమైంది ? ప్రజలు ఇంట్లో ఉండలేరు..బయటకు రాలేరు

ముంబై నగరానికి ఏమైంది ? ప్రజలు ఇంట్లో ఉండలేరు..బయటకు రాలేరు. ఎందుకంటే ఎడతెరపి లేకుండా..భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద నీరు పోటెత్తుతోంది. నీళ్లల్లో ముంబై తేలుతోంది. ఎక్కడ చూసినా నీళ్లే కనబడుతున్నాయి. ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.



రోడ్లపై భారీగా నీరు నిలవడంతో వేలాది వాహనాలు మునిగిపోయాయి. సైకిళ్లు, రిక్షాల నుంచి మొదలుకొని బస్సుల వరకు నీటిలో తేలాడుతున్నాయి. వరద నీటిని బయటకు పంపేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వడం లేదు. దీంతో వాహనాలు పనికి రాకుండా పోతున్నాయని అంటున్నారు.

దేశ ఆర్థిక రాజధని ముంబైని ఓ వైపు కరోనా అల్లాడుతుంటే…భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నైరుతి రుతుపవనాలకు తోడు..అరేబియా సముద్రంలో ఏర్పడిన ద్రోణి కారణంగా…భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో 25.2 సెంటిమీటర్ వర్షం కురిసింది. ముంబైతో పాటు..థాణే, రాయ్ గడ్ జిల్లాలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి.



ఇదే పరిస్థితి రెండు రోజుల వరకు ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. వర్షాకాలం వచ్చిందంటే…చాలు…ముంబై నగరం వణికిపోతోంది. ఆగకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత 15 సంవత్సరాల్లో ఇంతటి వర్షం కురవడం..ఇదే మొదటిసారి అని వాతావరణ నిపుణులు అంటున్నారు.

ఏది రోడ్డో..డ్రైనేజీ ఎక్కడుందో తెలియడం లేదు. వర్షంతో పాటు..భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. హోర్డింగ్స్ పేక మేడలా కూలిపోతున్నాయి. చెట్లు, కరెంటు స్తంభాలు విరిగి పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు, అపార్ట్ మెంట్ లో నీరు చేరింది. ముంబై జేజే ఆసుపత్రిలోకి భారీగ వరద నీరు వచ్చి చేరింది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.