Bhabanipur Bypoll : భారీ భద్రత నడుమ..భవానీపూర్ ఉపఎన్నికకు సర్వం సిద్ధం

వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బరిలో ఉన్న దక్షిణ కోల్ కతాలోని భవానీపుర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక గురువారం జరగనున్న నేపథ్యంలో అధికారులు భద్రతను కట్టదిట్టం చేశారు.

Bhabanipur Bypoll : భారీ భద్రత నడుమ..భవానీపూర్ ఉపఎన్నికకు సర్వం సిద్ధం

Bengal (2)

Bhabanipur Bypoll వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బరిలో ఉన్న దక్షిణ కోల్ కతాలోని భవానీపుర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక గురువారం జరగనున్న నేపథ్యంలో అధికారులు భద్రతను కట్టదిట్టం చేశారు. గతంలో జరిగిన హింసాత్మక ఘటనల దృష్టిలో ఉంచుకుని 15 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించినట్లు బుధవారం ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. పోలింగ్‌ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్‌ విధించినట్లు చెప్పారు.

కోల్ కతా పోలీస్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం..ప్రతి పోలింగ్‌ బూత్‌ లోపల కేంద్ర బలగాలకు చెందిన ముగ్గురు జవాన్లు, పోలింగ్ కేంద్రం బయట రాష్ట్ర పోలీసులు పహారా కాస్తారు. పోలింగ్‌ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుమిగూడరాదు. రాళ్లు, బాణసంచా, ఇతర పేలుడు పదార్థాలు, ఆయుధాలను వెంట తీసుకెళ్లడంపై నిషేధం విధించాం. ఒక అదనపు పోలీస్‌ కమిషనర్‌, నలుగురు జాయింట్‌ కమిషనర్లు, 14 డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్‌ కమిషనర్లను భవానీపుర్‌కు పంపించినట్లు చెప్పారు.

13 క్విక్‌ రెస్పాన్స్‌ బృందాలు, 22 సెక్టార్ మొబైల్,9 HRFS(హెవీ రేడియో ఫ్లయింట్ స్క్వాడ్), 9 ఫ్లయింట్ స్క్వాడ్,9 స్టాటిక్‌ సర్వైలెన్స్‌ టీం,చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ల నుంచి స్ట్రైకింగ్ ఫోర్సెర్స్ ను రంగంలోకి దింపుతున్నామన్నారు. మూడు అదనపు కంట్రోల్ రూమ్స్ ని కూడా తెరిచినట్లు తెలిపారు. ఈవీఎమ్ లకు ఎస్కార్ట్ ఇచ్చే 141 ప్రత్యేక వాహనాల కోసం ప్రత్యేక ఏర్పాటు చేయబడ్డాయని తెలిపారు. లార్డ్ సిన్హా రోడ్ లోని షెకావత్ మొమోరియల్ గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్ లో ఈవీఎంలను భద్రపరిచేందుకు రెండు స్ట్రాంగ్ రూమ్ లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఇక, సిటీలో ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో పోలీసులందరూ రెయిన్ కోట్ లు ధరించాలని,గొడుగులు వెంట ఉంచుకోవాలని ఆదేశించబడ్డారని తెలిపారు. ఇక్కడి వాతావరణ పరిస్థితుల కారణంగా నీటిపారుదల శాఖ అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల సంఘం కూడా కోరిందని పోలీస్ అధికారి తెలిపారు. భారీ వర్షం కారణంగా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో సిద్ధంగా ఉండాలని మేము నీటిపారుదల శాఖ మరియు విపత్తు నిర్వహణ విభాగాన్ని కూడా కోరాము అని ఆయన చెప్పారు. ఇక, గురువారమే బెంగాల్ ఉప ఎన్నికలు జరగనున్న జంగీపూర్ మరియు సంసర్‌గంజ్‌లో కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు.

కాగా,భవానీపూర్ లో మమతకి మంచి పట్టు ఉంది. 2011, 2016 ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గం నుంచే మమతా బెనర్జీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ లోని నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ..బీజేపీ నేత సువెందు అధికారి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆమె సీఎం బాధ్యతలు చేపట్టారు. అయితే రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆమె ఆరు నెలల్లోగా శాసనసభ లేదా శాసనమండలికి ఎన్నిక కావాల్సి ఉంది. అయితే బెంగాల్ లో శాసనమండలి లేదు. ఈ నేపథ్యంలో భవానీపూర్ నుంచి గెలిచిన టీఎంసీ ఎమ్మెల్యే సోవన్‌దేవ్ ఛటోపాధ్యాయ్, మమతా బెనర్జీ కోసం రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీదీకి పోటీగా బీజేపీ నుంచి న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్‌ బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్‌ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. సీపీఐ నుంచి శ్రిజిబ్ బిశ్వాస్ పోటీ చేస్తున్నారు. సెప్టెంబరు 30 న భవానీపూర్ ఉపఎన్నిక పోలింగ్ జరగనుండగా.. అక్టోబరు 3 ఫలితాలు వెల్లడికానున్నాయి.