కొత్త మలుపు : నౌహీరా షేక్‌కు ఉచ్చు బిగుస్తోంది

  • Published By: madhu ,Published On : January 18, 2019 / 01:26 AM IST
కొత్త మలుపు : నౌహీరా షేక్‌కు ఉచ్చు బిగుస్తోంది

ఢిల్లీ : హీరా గ్రూప్‌ అధినేత్రి నౌహీరాషేక్‌ మెడకు  ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే దేశ, విదేశాలకు చెందిన డిపాజిటర్ల ఫిర్యాదులతో  అరెస్టై జైలుకు వెళ్లారు. మూడు నెలలు గడుస్తున్నా బెయిల్‌ దొరకక కటకటాల్లో ఊచలు లెక్కిస్తున్నారు. మరోవైపు ఆమెపై మరికొంతమంది ఖాతాదారులు పోలీసులకు ఫిర్యాదు చేస్తుండడంతో విచారణ మరింత ముమ్మరంకానుంది. జైల్‌లో ఉన్న ఆమెను.. తమకు అప్పగించాలని ఇప్పుడు  హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు కోరుతున్నారు. 
రెచ్చిపోతున్న నౌహీరా అనుచరులు
బాధితులపై బెదిరింపులకు పాల్పడుతున్న నౌహీరా అనుచరులు
హైదరాబాద్‌ సీపీకి కర్నాటక వాసి కంప్లైంట్‌
కర్నాటక సీఎంకు మరికొంత మంది బాధితుల ఫిర్యాదు

నౌహీరాషేక్‌ జైల్‌లో ఊచలు లెక్కపెడుతున్నా ఆమె అనుయాయులు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. బాధితులు నౌహీరాపై కేసులు పెట్టకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారు. కర్నాటకకు చెందిన ఓ బాధితుడిపై నౌహీరాతో సంబంధమున్న కొంతమంది రౌడీలు బెదిరింపులకు దిగారు. దీంతో  అతడు హైదరాబాద్‌ సీపీకి ఫిర్యాదు చేశాడు. మరికొంత మంది బాధితులు కర్నాటక సీఎం ఫిర్యాదు చేయగా.. భరత్‌నగర్‌ పోలీస్‌లో నౌహీరాపై కేసు నమోదైంది. 
నౌహీరా అరెస్ట్‌ అయ్యి 60 రోజులు
నేటికీ చార్జిషీట్‌ దాఖలు చేయని పోలీసులు
పోలీసుల తీరును సవాల్‌ చేసిన హీరా తరపు న్యాయవాది
ముంబైలో నౌహీరాపై 273 ఫిర్యాదులు

ఆమె అరెస్టు అయ్యి 60 రోజులు దాటినా పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేయలేదు. దీన్ని సవాల్‌ చేస్తూ ఆమె తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. చిత్తూరు పోలీసులు ప్రొడక్షన్‌ వారెంట్‌పై తీసుకెళ్లినందుకు ఆమెను తిరిగి ముంబై రప్పించాలని కూడా న్యాయవాది కోరారు. వాదనలు విన్న జడ్జి తీర్పును వాయిదా వేశారు. ముంబైలో ఆమెపై మొత్తంగా  273 ఫిర్యాదుల పోలీసులకు అందాయి.