రోడ్డుపై గాయాలతో కోతి : నా కారు పంపిస్తున్నానన్న మేనకా గాంధీ

  • Published By: veegamteam ,Published On : November 19, 2019 / 09:04 AM IST
రోడ్డుపై గాయాలతో కోతి : నా కారు పంపిస్తున్నానన్న మేనకా గాంధీ

మేనకా గాంధీ ఎంపీ కాకముందునుంచే జంతు ప్రేమికురాలు..పర్యావరణ వేత్త అనే విషయం తెలిసిందే. గాయపడిన జంతువుల గురించి తెలిస్తే వెంటనే స్పందిస్తారు. సహాయాన్ని అందిస్తారు. ఈ క్రమంలో రోడ్డుపై ఓ కోతి గాయాలతో పడి ఉంది. ఆ కోతిని కాపాడేందుకు ఎవరైనా ముందుకు రావాలని కోరుతూ జర్నలిస్ట్ భారతీ జైన్ ట్విటర్లో  మేనకా గాంధీని ట్యాగ్ చేశారు. వెంటనే స్పందించిన ఆమె  చికిత్స కోసం తన కారులోనే కోతిని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు.

‘ఈ కోతి తీవ్రంగా గాయపడింది. పరిస్థితి విషమంగా ఉంది. ఎన్జీవో, జంతుప్రేమికులు ముందుకొచ్చి దాన్ని కాపాడగలరు. ఢిల్లీలోని రైసినా రోడ్డులోని ప్రెస్‌క్లబ్ సమీపంలో అది పడిందని’ పేర్కొంటూ మేనకను ట్యాగ్ చేస్తూ భారతీ జైన్ ట్వీట్ చేసారు. దీనిపై మేనకా వెంటనే  ట్విటర్లో స్పందిస్తూ.. ‘నన్ను ట్యాగ్ చేసినందుకు ధన్యవాదాలు.

సంజయ్ గాంధీ జంతుసంరక్షణ కేంద్రంలో చికిత్స అందించేందుకు వెంటనే కారు పంపిస్తున్నాను. కొన్ని క్షణాల్లో ఆ కారు అక్కడుంటుంది’ అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో  మేనకాగాంధీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.