హైఅలర్ట్ : దేశంలో 4 విమానాశ్రయాలు మూసివేత

  • Published By: madhu ,Published On : February 27, 2019 / 06:18 AM IST
హైఅలర్ట్ : దేశంలో 4 విమానాశ్రయాలు మూసివేత

భారత సరిహద్దులను యుద్ధ మేఘాలు కమ్మేశాయి. పాక్ యుద్ధ విమానాన్ని భారత్ కూల్చేసింది. పాక్ కూడా ప్రతిదాడులకు దిగిందని.. రెండు భారత యుద్ధ విమానాలను కూల్చేశాం అని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. భారత్, పాక్ దేశాల మధ్య పోటాపోటీ దాడులు జరుగుతుండటంతో.. ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. పాక్ సరిహద్దులకు సమీపంగా ఉండే అన్ని విమానాశ్రయాలను మూసివేసింది.

జమ్మూ, శ్రీనగర్ ఎయిర్ పోర్టులను నిరవధికంగా మూసివేశారు. తిరిగి ఎప్పుడు తెరిచేది కూడా ప్రకటించలేదు. అదే విధంగా అమృత్ సర్, ఛండీగడ్‌‌ విమానాశ్రయాలను కూడా మూసివేసింది. ఎయిర్ పోర్టుల్లో హైఅలర్ట్ ప్రకటించారు. విమాన సర్వీసులు కూడా రద్దు చేయటంతో.. ఎవరినీ అనుమతించటం లేదు.

అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఆయా సంస్థలు కూడా ప్రకటించాయి. ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కూడా కోరాయి విమాన సంస్థలు. ఈ నాలుగు ప్రాంతాలకు టికెట్ బుకింగ్స్ కూడా నిలిపివేశారు.