జమ్మూకాశ్మీర్‌లో హైఅలర్ట్ : ఉగ్రదాడులు జరగొచ్చని హెచ్చరిక

  • Published By: veegamteam ,Published On : April 25, 2019 / 05:49 AM IST
జమ్మూకాశ్మీర్‌లో హైఅలర్ట్ : ఉగ్రదాడులు జరగొచ్చని హెచ్చరిక

జమ్మూకాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోనున్నారా. ఉగ్ర దాడులు జరిగే ఛాన్స్ ఉందా. ఎన్నికల్లో రక్తపాతం సృష్టించేందుకు స్కెచ్ వేశారా.. అంటే నిఘా వర్గాలు అవుననే అంటున్నాయి. జమ్మూకాశ్మీర్‌లో హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రదాడులు జరగొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఏప్రిల్ 29, మే 6న జరిగే రెండు దశల ఎన్నికల్లో ఉగ్రవాదులు దాడులక పాల్పడొచ్చని నిఘా వర్గాలు వార్నింగ్  ఇచ్చాయి. ప్రాణ నష్టం చేసేందుకు ప్రయత్నం చేయవచ్చని చెప్పాయి. నిఘా వర్గాల సమాచారంతో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. భారీగా బలగాలను మోహరించారు. గస్తీని పెంచారు. ఉగ్రవాదుల కోసం గాలింపు  చర్యలు చేపట్టారు.

దక్షిణ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పరిధిలోని గురువారం (ఏప్రిల్ 25,2019) తెల్లవారుజామున ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు ఇద్దరు టెర్రిరిస్టులను మట్టుబెట్టారు. అనంత్‌నాగ్ జిల్లాలోని బిజ్ బెహర, బగేందర్  మొహల్లా ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఇంతలో ఎదురుపడ్డ ఉగ్రవాదులు బలగాలపై కాల్పులు జరిపారు. జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు  ఉగ్రవాదులు హతమయ్యారు. వారి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు జరిపిన సమీప ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది సోదాలు కొనసాగుతున్నాయి.

అనంత్ నాగ్ లో ఏప్రిల్ 23న పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం హై అలర్ట్ ప్రకటించారు. జమ్మూకాశ్మీర్ లో ఇంకా రెండు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏప్రిల్ 29, మే 6న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలు టార్గెట్  గా ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలకు సమాచారం అందింది. ప్రాణ నష్టం కల్పించే విధంగా ఉగ్రదాడులు జరగొచ్చని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. అనంత్ నాగ్ ప్రాంతంలో కూంబింగ్  ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు. ఎన్నికలు జరుగుతుండటంతో సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. పుల్వామా దాడి తర్వాత ఉగ్రవాద కదలికలపై నిఘా పెట్టారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత మూడు  నెలల్లో 70మంది టెర్రరిస్టులను మట్టుబెట్టారు. జైషే మహ్మద్, లష్కరే తొయిబా, హిజ్ బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన వారు ఇంకా బయటికి వస్తూనే ఉన్నారు.