డిప్యూటీ సీఎం ఇంటికి నిప్పు : రగులుతున్న ఈటానగర్

  • Published By: madhu ,Published On : February 24, 2019 / 11:54 AM IST
డిప్యూటీ సీఎం ఇంటికి నిప్పు : రగులుతున్న ఈటానగర్

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈటానగర్ అట్టుడుకుతోంది. జనాలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు..నిరసనలు తెలియచేస్తున్నారు. స్థానికేతరులకు శాశ్వత నివాస ధృవపత్రాలు ఎలా ఇస్తారంటూ మండిపడుతున్నారు. వీరు చేపడుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. వాహనాలకు నిప్పు పెడుతున్నారు. ఏకంగా డిప్యూటీ సీఎం ఇంటికి నిప్పు పెట్టడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. రంగప్రవేశం చేసిన పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ నిరసనకారులను రెచ్చగొట్టేందుకు లాఠీఛార్జీ ప్రయోగించారు. 

సిటిజెన్ షిప్ బిల్‌కు వ్యతిరేకంగా కొన్ని రోజుల నుండి ఇక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. గత శుక్రవారం జరిగిన అల్లర్లలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందడంపై ప్రజలు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. వీధుల్లోకి వచ్చి వీరంగం సృష్టిస్తున్నారు. ఈటానగర్, నహర్ లాగూన్‌లో నిరసనకారులు రెచ్చిపోయారు. డిప్యూటీ సీఎం చౌనా మే ఇంటిని తగులబెట్టారు. సెక్రటేరియట్‌లోకి చొరబడేందుకు ఆందోళనకారులు ట్రై చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నించారు. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ముందస్తుగా జాగ్రత్తలో భాగంగా కేంద్ర బలగాలను రంగంలోకి దించుతున్నారు. 

రాష్ట్రంలో కొన్ని జాతుల వారు నివాసం ఉంటున్నారు. నివాస ధృవపత్రాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. కొన్ని జాతుల వారికి అనుకూలంగా సిఫార్సులు చేసినట్లు, స్థానికేతరులుగా ఉన్న వారికి శాశ్వత నివాస ధృవపత్రాలు ఇస్తున్నారనే కారణంతో ఆందోళనలు స్టార్ట్ అయ్యాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు రాష్ట్రంలో శాశ్వత నివాసం ఇవ్వడం వల్ల అన్యాయం జరుగుతుందని వారు పేర్కొంటున్నారు.