Delhi Highest temperatures : ఢిల్లీలో మండే ఎండలు…76 ఏళ్ల తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు

ఈ ఏడాది భానుడి ఉగ్రరూపం మొదలైంది. ఈ వేసవిలో ఎండల ప్రతాపం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన కొన్ని రోజులకే భానుడి ప్రతాపం షురూ అయ్యింది.

Delhi Highest temperatures : ఢిల్లీలో మండే ఎండలు…76 ఏళ్ల తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు

Delhi Highest Temperatures

Highest temperatures recorded in Delhi : ఈ ఏడాది భానుడి ఉగ్రరూపం మొదలైంది. ఈ వేసవిలో ఎండల ప్రతాపం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన కొన్ని రోజులకే భానుడి ప్రతాపం షురూ అయ్యింది. హోలీ పర్వదినాన సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో భానుడు నిప్పులు కురిపించాడు. ఈ వేసవి తొలి ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోయారు. బయటకు వచ్చేందుకే భయపడుతూ ఇళ్లకే పరిమితమయ్యారు.

సోమవారం ఢిల్లీలో ఏకంగా 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 76 సంవత్సరాల తర్వాత ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. సాధారణం కంటే ఇది 8 డిగ్రీలు అధికమని.. సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో ఈ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొన్నారు.

1945వ సంవత్సరం మార్చి 31న ఇక్కడ రికార్డు స్థాయిలో 40.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని, ఆ తర్వాత మళ్లీ ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అని అధికారులు చెబుతున్నారు. అలాగే నజఫ్‌గఢ్, నరేలా, పీతంపురా, పుసా ప్రాంతాల్లోని వాతావరణ కేంద్రాల్లో 41.5 డిగ్రీల నుంచి 41.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు.

మార్చి నెల ముగుస్తుందో లేదో అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఇక మే నెల ఆఖరికి వచ్చేసరికి ఉష్ణోగ్రతలు ఎంతగా పెరిగిపోతాయోనన్న భయం ఢిల్లీ ప్రజల్లో నెలకొంది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల్లో సాధారణ ఎండలకే ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతుంటారు. అలాంటిది ఒకేసారి 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కావడంతో.. ఈ వేసవి కాలం మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొవాల్సిందేనని పేర్కొంటున్నారు.