ముస్లిం యువతి పెళ్ళి ఊరేగింపుకి మానవహారంగా నిలబడిన హిందువులు

  • Published By: chvmurthy ,Published On : December 26, 2019 / 10:26 AM IST
ముస్లిం యువతి పెళ్ళి ఊరేగింపుకి మానవహారంగా నిలబడిన హిందువులు

దేశవ్యాప్తంగా సీఏఏ నిరసనలు వెల్లువెత్తి కర్ఫ్యూ విధించిన ప్రాంతంలో ఒక ముస్లిం యువతి వివాహానికి  హిందువులందరూ మేమున్నామని అండగా నిలిచి దగ్గరుండి వివాహం జరిపించారు. ఈ సంఘటన యూపీలోని కాన్పూర్ లోని బకర్గంజ్  ప్రాంతంలో జరిగింది. స్ధానికంగా నివాసం ఉండే ముస్లిం కుటుంబంలోని జీనత్(25) అనే యువతికి ప్రతాప్ ఘడ్ కు చెందిన హస్నైన్ ఫారూకీతో పెళ్లి కుదిరింది. సీఏఏ వ్యతిరేక నిరసనలు జరిగి కర్ఫూ విధించిన కాన్పూర్ కు పెళ్ళి కోడుకు వారు రావటానికి అంగీకరించలేదు. దీంతో ఆడపెళ్ళి వారి కుటుంబంలో ఆందోళన మొదలైంది. 

నగరంలో హింసాత్మక సంఘటనలు జరిగి ప్రాంతమంతా పారామిలటరీ బలగాల పహారాలో ఉంది. ప్రజలంతా భయాందోళనలతో ఉన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి(సిఎఎ) వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో ఇద్దరు యువకులు మరణించారు. పోలీసులు, పారా మిలటరీ బలగాలు ఈ ప్రాంతంలో పహారా కాస్తున్నాయి. కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. పెళ్పి ఆగిపోవల్సిందేనా? అని భయవడ్డారు.

డిసెంబర్ 21 న జరిగాల్సిన బరాత్  వేడుకకు పెళ్ళి కొడుకు వారు రాలేమని చెప్పటంతో  ఆకుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జీనత్ మేనత్త భర్త వాజిద్ ఫజల్ మగ పెళ్ళివారితో సంప్రదింపులు చేస్తూనే ఉన్నాడు.  వారు కాన్పూర్ రావటానికి భయపడుతున్నారు. ఏం చేయాలో ఎవరికీ అర్ధం కావటంలేదు. ఈ విషయం ఆ పేటలో అందరికీ తెలిసిపోయింది. జీనత్ పెళ్లి ఆగిపోతోందనే పుకారు మొదలైంది.

ఈ సంగతి  అదే ప్రాంతంలో నివాసం ఉండే ఒక స్కూల్ కరస్పాండెంట్  విమల్ చపాడియాకు తెలిసింది. ఒక ఆడపిల్ల పెళ్ళి ఆగిపోతోందని తెలిసి చాలా బాధ పడ్డాడు. ఏం చేయాలో అని ఆలోచించి తన మిత్రులు సోమ్నాథ్ తివారీ మరియు నీరజ్ తివారీ అనే ఇద్దరు మిత్రులతో కలిసి పెళ్లి కొడుకు హస్నైన్‌తో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. మీకు మేము అండగా ఉంటామని చెప్పారు. వారిని బయలు దేరి బరాత్ కు రమ్మని చెప్పారు. ఇక పెళ్ళి కార్యక్రమం మొదలైంది.

డిసెంబర్ 21 సాయంత్రానికి మగ పెళ్ళివారు సుమారు 70 మంది బస్సు, కార్లలో వచ్చారు. వారిలో రిటైరైన పెద్దవారు చాలా మంది ఉన్నారు.  విమల్ చపాడియా పరిస్ధితిని స్ధానికంగా ఉన్న తన హిందూ మిత్రులకు చెప్పాడు. వారంతా అతనికి అండగా నిలబడ్డారు. చపాడియా నేతృత్వంలోని స్ధానిక హిందువులంతా…బరాత్ జరిగే  కిలోమీటరు దూరం వరకు రక్షణ కవచంలా మానవహారం ఏర్పాటు చేసి నిలబడిపోయారు. బారాత్ ఎటువంటి అవాంతరం లేకుండా జరిగిపోయింది. 

వధువు జీనత్ తన ఇంటినుంచి  వేదిక వద్దకు వచ్చింది. సాంప్రదాయబద్ధంగా ఆమె వివాహం ఎటువంటి అడ్డంకులు లేకుండా ముగిసింది.  ఆమె సంతోషంతో తన అత్తవారింటికి క్షేమంగా వెళ్ళింది, రెండు రోజుల తర్వాత పుట్టింటికి వచ్చిన జీనత్ మొదటగా విమల్ చపాడియా ఇంటికి వెళ్ళి ఆయనకు కృతజ్ఞతలు తెలిపి..తనను ఆశీర్వదించమని కోరింది. ఎందుకంటే ప్రతి ఆడపిల్ల జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన ఘట్టం.

12 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయింది జీనత్. జీవితంలో జరిగే మధురమైన ఘట్టం సీఏఏ అల్లర్ల వల్ల ఆగిపోతోందేని తెలిసే సరికి ఆమె పెళ్ళి మీద ఆశలు వదులుకుంది. విమల్ చాపాడియా ఆమెకు దేవుడిలా సాయపడి ఆమెను ఒకింటి దాన్ని చేసాడు. “నేను సరైన పనే చేశాను. జీనత్ నాకు చిన్నప్పటినుంచి తెలుసు. ఆమె నా చెల్లెల్లులాంటిది. ఆమె పెళ్ళి ఆగిపోతోందని తెలిసి నేను ఎట్లా ఉండగలను. అందుకే నా ప్రయత్నం నేను చేశాను. ఇరుగు పొరుగు వారనప్పడు అవసరమైన సమయాల్లో వారికి అండగా నిలబడాలి… నేను అదే చేశాను” అంటున్నాడు విమల్ చపాడియా.