జలుబు, దగ్గుకి మందులు, యాంటీ బయాటిక్స్ కన్నా తేనె మేలు, స్టడీ

  • Published By: naveen ,Published On : August 19, 2020 / 03:40 PM IST
జలుబు, దగ్గుకి మందులు, యాంటీ బయాటిక్స్ కన్నా తేనె మేలు, స్టడీ

ప్రతి మనిషికి కామన్ గా వచ్చే అనారోగ్య సమస్యలు జలుబు, దగ్గు. ఇవి తరుచుగా వస్తుంటాయి. వయసుతో నిమిత్తం లేదు. చిన్న, పెద్ద.. ముసలి, ముతకా అందరికి ఈ జబ్బులు అటాక్ అవుతుంటాయి. సీజన్ మారినప్పుడు లేదా నీరు మారినప్పుడు లేదా కాలుష్యం బారిన పడినప్పుడు జలుబు లేదా దగ్గు రావడం కామన్. అయితే జలుబు లేదా దగ్గు వచ్చినప్పుడు వెంటనే మందులు వాడతారు. కొందరు యాంటి బయోటిక్స్ వేసుకుంటారు. చాలామందిలో ఈ అలవాటు ఉంది.



అయితే అది ప్రమాదకరం. ఎందుకంటే, ప్రతీ చిన్న అనారోగ్యానికీ ట్యాబ్లెట్లు వేసుకుంటే… మన బాడీలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఏదైనా జబ్బు రాగానే మంచి బ్యాక్టీరియా… ఆ జబ్బుకి కారణమయ్యే సూక్ష్మక్రిములను తరిమెయ్యడం మానేస్తాయి. ట్యాబ్లెట్ వేసుకుంటారుగా మనకెందుకులే అని సైలెంటవుతాయి. అందువల్ల మంచి బ్యాక్టీరియాతోనే పని కానివ్వాలి. అందుకోసం మనం వీలైనంతవరకూ శరీరానికి మందులు అలవాటు చెయ్యకూడదు.



అదే సమయంలో జలుబు లేదా దగ్గు లాంటివి వచ్చినప్పుడు మందులు లేదా యాంటి బయోటిక్స్ అవసరం లేదని, జస్ట్ హనీ(తేనే) చాలు అని నిపుణులు చెబుతున్నారు. ఓ అధ్యయనంలో ఈ విషయాన్ని కనుగొన్నారు. తేనే వినియోగంతో దగ్గు, జలుబు వెంటనే తగ్గుతాయని తేల్చారు. తేనేలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అధ్యయనకర్తలు చెప్పారు. అంతేకాదు మందుల ధరతో పోలిస్తే హనీ ధర చాలా తక్కువ అని గుర్తు చేశారు. ఛాతీ ఇన్ఫెక్షన్ల నుండి కోలుకోవడానికి యాంటీబయాటిక్స్ కంటే సహజ నివారణ చాలా ప్రభావవంతంగా ఉన్నట్లు స్టడీలో కనుగొనబడింది.



”ఎగువ శ్వాసకోశ అంటువ్యాధుల కోసం వైద్యులు సూచించినప్పుడు, యాంటీబయాటిక్స్ కు ప్రత్యామ్నాయంగా తేనేను సిఫారసు చేస్తాము. సాధారణ ఔషధాల కంటే తేనే చాలా ప్రభావవంతమైనది, తక్కువ హానికరమైనది” అని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నిపుణుడు హిబతుల్లా తెలిపారు. ”గొంతు మంట, దగ్గు, ముక్కు దిబ్బతో బాధపడుతున్న 1,760మందిపై పరిశోధన జరిపాము. వీరిలో తేనే వాడిన వారిలో రెండు రోజుల్లో లక్షణాలు తగ్గిపోయాయి. అంతేకాదు రోగ తీవ్రత కూడా తగ్గింది. సాధారణంగా జలుబుకి వాడే పదార్ధాల్లో తేనే వినియోగించడం మంచి ఫలితాలు చూపింది. పారాసిటమాల్ కన్నా మెరుగా తేనే పని చేసింది” అని ఆక్స్ ఫర్డ్ నిపుణుడు చెప్పారు.