Honey Trap : హనీ ట్రాప్.. వలపు వల వేసి డబ్బు సంపాదన

హనీ ట్రాప్.. ఒకప్పుడు ఇది చాలా అరుదుగా వినిపించిన మాట. కానీ.. ప్రస్తుతం ఈ ట్రాప్‌లో పడిపోతున్న వారు వందల సంఖ్యలో బయటకు వస్తున్నారు. వలపు వల వేసి డబ్బు సంపాదనే ధ్యేయంగా కొన్ని ముఠాలు పని చేస్తున్నాయి.

Honey Trap : హనీ ట్రాప్.. వలపు వల వేసి డబ్బు సంపాదన
ad

Honey Trap Cases : హనీ ట్రాప్.. ఒకప్పుడు ఇది చాలా అరుదుగా వినిపించిన మాట. కానీ.. ప్రస్తుతం ఈ ట్రాప్‌లో పడిపోతున్న వారు వందల సంఖ్యలో బయటకు వస్తున్నారు. వలపు వల వేసి డబ్బు సంపాదనే ధ్యేయంగా కొన్ని ముఠాలు పని చేస్తున్నాయి. సైబర్‌ నేరాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. రకరకాల నేరాలకు పాల్పడుతున్నారు మోసగాళ్లు. వారి వలలో చిక్కుకొని చాలా మంది విలవిల్లాడిపోతున్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్ వినియోగం పెరిగిన నేపథ్యంలో ఇలాంటి మోసాలు మరింతగా పెరిగిపోతున్నాయి ముఖ్యంగా నగరాల్లో పెద్ద ఎత్తున ఇలాంటి ముఠాల బారిన పడిన వారు బయట పడలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులు పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి. ఇక బయటపడని వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది.

ఇటీవల కేరళకు చెందిన ఓ మహిళ.. హనీ ట్రాప్‌తో అనేక మందిని వలలో వేసుకుని డబ్బులు గుంజుతోంది. ఆమెకు పెళ్లై, భర్తతోపాటు పిల్లలు కూడా ఉన్న ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్టు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అందింది. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో ఆమె వేధింపుల వల్ల చాలా మంది మోసపోయారని, ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదని బాధితుడొకరు తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఆమెపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కమిషన్‌ను అభ్యర్థించాడు. బాధితుడి ఫిర్యాదుపై స్పందించిన హెచ్‌ఆర్సీ నవంబర్ 10లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని రాచకొండ పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి మెసేజ్‌ల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

దేశ వ్యాప్తగా కూడా ఇలాంటి వ్యవహారాలు ఎక్కువ అవుతున్నాయి. ఎప్పటికప్పుడు వెలుగు చూస్తూనే ఉన్నాయి. డబ్బు కోసం అడ్డదారి పడుతున్నారు. అమ్మాయిల పేరుతో కొందరు యువకులకు వలవేసి, ట్రాప్‌లో దించేసి అందిన కాడికి దోచేస్తున్నారు. కాల్ గర్ల్స్‌ పేరిట మెసెజ్‌లు, అశ్లీల వీడియోలు, ఫొటోలను పంపించి, పక్కాగా వల పన్ని బట్టలో పడేస్తున్నారు. ఇక, ఫైనల్‌గా నగ్నంగా వీడియో కాల్స్‌ చేయిస్తామంటూ డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు.

అశ్లీల వీడియోలను, ఫొటోలను పంపి, న్యూడ్ వీడియో కాల్స్ చేయిస్తామని డబ్బు వసూలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను గత నెలలో కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా పలు యాప్‌లను ఉపయోగించి.. ఒకేసారి 100 నుంచి 1,000 మంది వరకు బల్క్ మేసేజ్‌లు పంపేది. కొంతమంది వీరి వలలో చిక్కుకొని అత్యధికంగా డబ్బులు చెల్లించారు. అలా చాలామంది మోసపోయినట్లు విచారణలో తెలిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా బాధితులు ఉన్నట్లు గుర్తించారు. కొంతమంది వీరి మాయ మాటలు నమ్మి వేలల్లో సొమ్ములు పోగొట్టుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు.

వాట్సాప్ యాప్‌లో మోసాలకు అంతే లేకుండా పోతోంది. నేరుగా లింక్స్ పంపించి ఆర్థిక మోసాలకు పాల్పడే బ్యాచ్‌లు కొన్ని అయితే, పరోక్షంగా రంగంలోకి దిగి పరిచయం పెంచుకుని, ఆ తర్వాత మోసాలకు తెరతీసే బ్యాచులు ఇంకొన్ని. అలా అపరిచితులుగా పరిచయమై, మోసపూరితమైన మాటలతో నమ్మించి, ఆ తర్వాత మోసాలకు పాల్పడుతున్న ఘటనల్లో ఈ నెలలోనే మరో కోణం వెలుగుచూసింది. మైలార్‌దేవులపల్లి పరిధిలో ఇలాంటి ఘటనలోనే ఓ ఇంటర్ విద్యార్థి మోసపోయిన ఘటన ఈ నెల 5న వెలుగుచూసింది. ఆ విద్యార్థిని బెదిరించి 20 వేల రూపాయలు ఇస్తే వదిలేస్తానని చెప్పి ఆ డబ్బులు వసూలు చేశారు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో మైలార్‌దేవులపల్లి పోలీసులకు ఆశ్రయించారు.

అచ్చం ఇదే తరహాలో శాస్త్రిపురానికి చెందిన మరో విద్యార్థి కూడా మోసపోయాడని తెలుసుకున్న పోలీసులు.. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. అందుకే అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాల్సిందిగా పోలీసులు సూచిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, కేరళ రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేసులు చాలా వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠాల్లో మహిళలు కూడా ఉంటున్నారు. ఈ ముఠాల చేతిలో మోసపోకుండా ఉండాలంటే అప్రమత్తంగా వ్యవహరించడం ఒక్కటే మార్గమని పోలీసులు చెబుతున్నారు.