అక్క, చెల్లెలిపై వేధింపులు…ముగ్గురు MNC ఉద్యోగులు అరెస్ట్

  • Published By: murthy ,Published On : October 6, 2020 / 06:32 PM IST
అక్క, చెల్లెలిపై వేధింపులు…ముగ్గురు MNC ఉద్యోగులు అరెస్ట్

దేశంలో మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకువచ్చి సత్వరం బాధితులకు న్యాయం చేసేలా..నిందితులకు శిక్షలుపడేలా చేస్తున్నా మహిళలు, బాలికలపై అత్యాచారాలు వేధింపులు ఆగటంలేదు. ఓ బీజేపీ ఎమ్మెల్యే మేన కోడళ్లని ముగ్గురు MNC కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు వేధించి,వెంటపడి కొట్టారు.

నోయిడా లో నివసించే ఇద్దరు అక్క చెల్లెళ్లు, మీరట్ లోని తాతగారింటికివెళ్ళి…. తిరిగి నోయిడా వెళుతుండగా సోమవారం ఈ ఘటన జరిగింది. దాదాపు 46 కిలోమీటర్లు నిందితులు వారిని వేధిస్తూనే ఉన్నారు. రెండు గంటల పాటు జరిగిన ఈ వేధింపులలో నిందితులు బాలికలను వీడియో తీయటం, వారితో అసభ్యంగా ప్రవర్తించటం..వారి కారును అడ్డగించటం చేశారు.



బాలికలు కారు దిగినప్పడు వారిని కొట్టటం కూడా జరిగింది. కాగా బాలికలతో పాటు ఉన్న వ్యక్తిగత భద్రతాసిబ్బంది ఉన్నప్పటికీ దుర్మార్గులు వారి ఆగడాలను ఆపలేదు. బాలికల కారు పక్కనే వారి కారుని పోనివ్వటం..వారిని ఫోటోలు, వీడియోలు తీయటం వంటి చర్యల ద్వారా బాలికలను ఇబ్బందులకు గురి చేశారు. జాతీయ రహదారి 34 మీద వారు రెండు గంటలపాటు బాలికలకు నరకం చూపించారు.

తాతగారి ఇంటినుంచి బయలు దేరి వారు మీరట్ లో జాతీయ రహదారి ఎక్కిన తర్వాత నుంచి నిందితులు బాలికల కారును ఫాలో అవుతూ వస్తున్నారు. మురుద్ నగర్ చేరుకునే సరికి బాలికలను వీడియో తీయటం ప్రారంభించారు.



కారులో ఉన్న వ్యక్తిగత సెక్యూరిటీ వీడియోలు తీయవద్దని చెప్పటంతో ముగ్గురు కలిసి అతడిని తిట్టారు. అసభ్య కరమైన, ఆశ్లీల కరమైన హావభావాలు ప్రదర్శిస్తూ బాలికలను వేధించారు. ఇలా వెంట పడుతుండగా బాలికలు జాతీయ రహదారిపై ఉన్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ వద్ద కారును ఆపారు.

నిందితులు కూడా తమ కారును ఆపి బాలికల వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించటం మొదలెట్టారు. కానిస్టేబుల్ వారిని అడ్డుకున్నాడు. తన తండ్రి ఢిల్లీలో ఉన్నత స్ధాయి ఉద్యోగి అని …నీపై కేసు పెడతా అని… నిందితుల్లో ఒకడు పోలీసు కానిస్టేబుల్ ను హెచ్చరించాడు. దీంతో వారి మధ్య గొడవ జరగటం ప్రారంభమైంది.



ఈలోగా కానిస్టేబుల్ అలర్టై కంట్రోల్ రూం కు సమాచారం చేరవేయటంతో అదనపు పోలీసులు వచ్చి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై సిహానీ గేట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

అరెస్టైన నిందితులు రాజస్థాన్ నివాసి రోమిల్, ఘజియాబాద్ నివాసి రజత్ రానా, గురుగ్రాంలో నివసించే శుభం పాండేగా గుర్తించారు. రోమిల్ మరియు రానా ఇంజనీర్లుగా, నోయిడాలోని MNC ఆధారిత సంస్థలో పనిచేస్తుండగా, శుభం గురుగ్రామ్‌లోని మొబైల్ యాప్ కంపెనీలో పనిచేస్తున్నాడు.