Corona Second wave‌..: మరణాలకు కారణం ఇదే.. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత!

Corona Second wave‌..: మరణాలకు కారణం ఇదే.. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత!

Hospitals Are Facing Acute Shortage Of Oxygen In The Second Wave Of The Coronavirus Pandemic

Corona Second wave: దేశంలో కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య ఊహించనిరీతిలో పెరుగుతుండడంతో…చికిత్సకు సరిపడా సదుపాయాలు లేక ఆస్పత్రులు చేతులెత్తేస్తున్నాయి. ముఖ్యంగా ఆక్సిజన్ కొరతతో రోగులు అల్లాడుతున్నారు. కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో సరిపడా ఆక్సిజన్ నిల్వలు లేవు. ప్రాణవాయువు అందక…అయినవారి కళ్లముందే…ప్రాణాలు కోల్పోతున్నారు వైరస్ బాధితులు.

దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవడానికి కారణం ఆస్పత్రుల్లో సరిపడా ఆక్సిజన్ లేకపోవడమే. ప్రధాన నగరాల ఆస్పత్రులతో పాటు.. మారుమూల ప్రాంతాల్లోనూ ఆక్సిజన్ కావాల్సిన రోగుల సంఖ్య భారీగా ఉంటోంది. దీంతో అనేక రాష్ట్రాలకు అదనంగా ఆక్సిజన్ సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం 50వేల మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ దిగుమతి చేసుకోవాలని భావిస్తోంది. అయితే ప్రస్తుతం అనుసరిస్తున్న రవాణా విధానంతో…సకాలంలో ఆక్సిజన్ సరఫరా చేయడం కష్టసాధ్యంగా మారింది.

ప్రతి వందమంది కరోనా రోగుల్లో 20 మందిలో లక్షణాలు ఎక్కువగా ఉంటున్నాయి. వారిలో ముగ్గురికి ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రోజువారీ కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్న మహారాష్ట్రలోనే ఆక్సిజన్ కావాల్సిన రోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ రాష్ట్రానికి వెయ్యీ 250 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం ఉండగా…ఆ మొత్తాన్ని ఇప్పటికే వినియోగించుకుంటోంది.

మహారాష్ట్రలో ఆరు లక్షల 38వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. బాధితుల్లో 60వేల నుంచి 65వేల మందికి ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితి. రాష్ట్రంలోని ఉత్పత్తి సరిపోకపోవడంతో చత్తీస్ గఢ్ నుంచి 50 టన్నులు, గుజరాత్ నుంచి మరో 50 టన్నులు దిగుమతి చేసుకుంటోంది మహారాష్ట్ర. గుజరాత్ జామ్‌నగర్‌లోని రిలయన్స్ ప్లాంట్ నుంచి మహారాష్ట్ర వంద టన్నుల ఆక్సిజన్ తీసుకుంటోంది.

కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపిస్తోన్న మధ్యప్రదేశ్‌ ఆక్సిజన్ కొరతతో అతలాకుతలమవుతోంది. ఆ రాష్ట్రంలో అసలు ఆక్సిజన్ తయారీ ప్లాంట్ లేదు. రోజుకు 250 టన్నుల ఆక్సిజన్ మధ్యప్రదేశ్‌కు కావాల్సి ఉండగా…గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇప్పటిదాకా మధ్యప్రదేశ్‌కు ఆక్సిజన్ అందిస్తున్న రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాలు ఎగుమతులు తగ్గించడంతో మధ్యప్రదేశ్‌లో కరోనా మరణాల సంఖ్య పెరుగుతోంది.

ఇక గుజరాత్‌కు రోజుకు 500 టన్నుల ఆక్సిజన్ అవసరమవుతోంది. సెకండ్‌ వేవ్‌లో కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, కర్నాటక, ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీ, చత్తీస్‌గఢ్, కేరళ, తమిళనాడు, పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు అదనంగా ఆక్సిజన్ సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది. 17వేల టన్నుల ఆక్సిజన్‌ను మూడు విడతలుగా ఆయా రాష్ట్రాలకు అందించాలని కేంద్రం భావిస్తోంది.

ఇనుము, ఉక్కు పరిశ్రమల్లో, కొన్ని ఆస్పత్రుల్లో, మందుల తయారీ యూనిట్లలో, గ్లాస్ తయారీ పరిశ్రమల్లో ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతుంది. కోవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో అన్ని రాష్ట్రాలు తమ మొత్తం ఆక్సిజన్ ఉత్పత్తిని వైద్యావసరాల కోసమే వినియోగిస్తున్నాయి. భారత్‌కు 7వేల టన్నులకు పైగా ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. 99.5శాతం స్వచ్ఛత ఉండే ద్రవ ఆక్సిజన్‌ను ఉత్పత్తిదారులు తయారుచేస్తారు. దాన్ని జంబో ట్యాంకర్లలో నిల్వ ఉంచుతారు. ప్రత్యేక ఉష్ణోగ్రతల దగ్గర క్రయోజనిక్ ట్యాంకర్లలో ఆక్సిజన్‌ను రవాణా చేస్తారు. డిస్ట్రిబ్యూటర్ స్థాయిలో రీగ్యాసిఫికేషన్ విధానంలో ఆక్సిజన్‌ను వాయురూపంలో మార్చి…జంబో సిలిండర్లలో, డ్యూరా సిలిండర్లలో నింపుతారు. ఈ చిన్న సిలిండర్లను సరఫరా దారులకు లేదంటే డైరెక్ట్‌గా ఆస్పత్రులకు రవాణా చేస్తారు. ఆక్సిజన్‌ కోసం డిమాండ్ బాగా పెరిగినా.. వాటి నిల్వకు, సరఫరాకు కావల్సినన్ని సిలిండర్లు, ట్యాంకర్లు లేకపోవడంతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. ఆక్సిజన్ వృథా కాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరిస్తోంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లకు 40లీటర్ల ఆక్సిజన్, సాధారణ వార్డులకు 15లీటర్ల ఆక్సిజన్ సరఫరా చేయాలని గత ఏడాది కేంద్రం నిర్ణయించింది.

మనకు కావల్సిన దాంట్లో 60శాతం ఆక్సిజన్ భారత్ సొంతంగా ఉత్పత్తి చేసుకుంటోంది. అయితే రవాణానే పెద్ద సమస్యగా మారింది. నిరంతరాయంగా మెడికల్ ఆక్సిజన్ సరఫరాకు కావల్సిన క్రయోజనిక్ ట్యాంకర్లు భారత్ దగ్గర సరిపడా లేవు. ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్రాంతం నుంచి…ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగికి ప్రాణవాయువు చేరడానికి ఆరు నుంచి ఎనిమిది రోజుల సమయం పడుతోంది. గతంలో అది మూడు నుంచి ఐదు రోజులుగా ఉండేది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రులకు ఇంకా ఎక్కువ సమయం పడుతోంది. దీంతో పాటు సిలిండర్ల రవాణా, రీఫిల్లింగ్ వ్యయం విపరీతంగా పెరిగిపోయింది.

గతంలో ఒక్కో సిలిండర్ రీఫిల్లింగ్‌కు వంద నుంచి 150 రూపాయలు అవసరమైతే ఇప్పుడు ఆ ఖర్చు 500 నుంచి 2000 రూపాయలకు పెరిగింది. దీనికి ప్రత్యామ్నాయంగా వంద ఆస్పత్రులు ఎంపిక చేసి సొంతంగా ఆక్సిజన్ ప్లాంట్లు తయారుచేసుకునే ఏర్పాట్లు చేయాలని కేంద్రం భావిస్తోంది. దీనివల్ల రవాణా ఖర్చు తగ్గడమే కాక, మారుమూల ప్రాంతాలకు ఆక్సిజన్ అందించడంలో జరుగుతున్న ఆలస్యాన్ని తగ్గించవచ్చని భావిస్తోంది. అనేక ఆస్పత్రులు ఆక్సిజన్ నిల్వ చేసుకునేందుకు భారీ ట్యాంకులు ఏర్పాటు చేసుకుంటున్నాయి.

అటు రోడ్డు రవాణా ద్వారానే కాకుండా…రైళ్ల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి విమానాల్లో ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేయాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సూచించారు.