దేశంలోని ఏడు నగరాల్లో ఇళ్ల ధరలకు రెక్కలు

దేశంలోని ఏడు నగరాల్లో ఇళ్ల ధరలకు రెక్కలు

India Real Estate

మధ్యతరగతి, సామాన్యుల కల సొంత ఇళ్లు కొనుక్కోవడం.. ఇప్పటికైనా సొంత ఇళ్లు కొనుక్కోవాలని, అద్దె ఇళ్లలోంచి బయటపడాలని ఆశపడుతారు.. అందుకే కష్టపడుతారు. కానీ, ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని చూస్తుంటే.. సొంత ఇంటి కల.. కల్లగానే మిగిలిపోయేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సొంతింటి కల సామాన్యుడికి అందని ద్రాక్షలాగే ఉంటుంది.

ప్రధాన నగరాల్లో ఇల్లు కొనాలి అంటే తడిసి మోపెడవుతుంది. ప్రతి ఏడూ పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు తమ సొంతింటి కలను నెరవేర్చుకోలేక పోతున్నారు. ఈ ఏడాది జనవరి – మార్చి మధ్య కాలంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు ఒకశాతం పెరిగినట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్‌ సంస్థ ‘అనరాక్‌’ తెలిపింది. ఇంటి నిర్మాణానికి ఉపయోగించే ముడిసరుకుల ధరలు రోజు రోజుకు పెరుగుతుండటమే ఇళ్ల ధరల పెరుగుదలకు కారణంగా చెబుతుంది ఈ సంస్థ.

2021 జూన్ తర్వాత ఇళ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా ఈ సంస్థ అంచనా వేస్తోంది. ఈ సంస్థ విడుదల చేసిన నివేదికను ఒకసారి పరిశీలిస్తే ఏడు ప్రధాన పట్టణాల్లో చదరపు అడుగు సగటు ధర రూ.5,599 నుంచి రూ.6,660కు పెరిగింది. 2020 మొదటి మూడు నెలల్లో ధరలతో పోల్చి ఈ వివరాలు విడుదల చేసింది.

దేశంలో ఢిల్లీలో రెండు శాతం వరకు ఇళ్ల ధరలు పెరిగాయి. ఢిల్లీలో చదరపు అడుగు రూ. 4,650కు చేరింది. ఇక ఆర్ధిక రాజధాని ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో ధర అధికంగా ఉంది. ఇక్కడ ఒకశాతం ధర పెరిగినట్లు ‘అనరాక్‌’ తెలిపింది. ఈ ప్రాంతంలో చదరపు అడుగు రూ.10,750 కి చేరింది. బెంగళూరు మార్కెట్లో 2 శాతం ధరపెరిగి చదరపు అడుగు రూ. 5,580కు చేరింది. మరో ప్రధాన నగరమైన కోల్‌కత్తాలో ఇళ్ల ధరలలో పెద్దగా పెరుగుదల కనిపించలేదు.

చదరపు అడుగు ధర రూ.4,385 నుంచి రూ.4,400 వరకు పెరిగింది. చెన్నై మహానగరంలో ఒకశాతం పెరిగింది. ఇక్కడ చదరపు అడుగు రూ.4,935 గా ఉంది. ఇక హైదరాబాద్ నగరం విషయానికి వస్తే.. ఇక్కడ కూడా ఒకశాతం ధరలు పెరిగినట్లు తెలిపింది ‘అనరాక్’ చదరపు అడుగు విక్రయ ధర రూ.4,195 నుంచి రూ.4,240కు చేరింది.

ఇళ్ల అమ్మకాలు కూడా 2021లో అమాంతం పెరిగాయి. 2020 మొదటి మూడు నెలల్లో 45,200 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదు అయ్యాయి.. 2021 వచ్చేసరికి ఆ సంఖ్య భారీగా పెరిగినట్లు అనరాక్ అంచనా వేసింది. 2021 మొదటి మూడు నెలల్లో 58,290 ఇళ్ల విక్రయాలు నమోదు కావచ్చని అనరాక్‌ తెలిపింది.