కరోనా వ్యాక్సిన్ పంపిణీకి గైడ్ లైన్స్ విడుదల

  • Published By: venkaiahnaidu ,Published On : December 14, 2020 / 06:16 PM IST
కరోనా వ్యాక్సిన్ పంపిణీకి గైడ్ లైన్స్ విడుదల

How will Indians be vaccinated for COVID-19? Govt issues detailed guidelines దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమంకి సంబంధించిన గైడ్ లైన్స్ ను కేంద్ర ప్రభుత్వం సోమవారం(డిసెంబర్-14,2020) విడుదల చేసింది. డిజిటల్​ ప్లాట్​ఫాం కొవిడ్​ వాక్సిన్​ ఇంటెలిజెన్స్​ నెట్​వర్క్​ (CO-WIN) ద్వారా లబ్ధిదారులు, టీకాల వివరాలను రియల్​ టైమ్​లో ట్రాక్​ చేయనున్నారు.

కరోనా నివారణ, వ్యాక్సిన్, పలు స్థాయిల్లో టీకా నిర్వహణ, మానవ వనరులు వారికి శిక్షణ, కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ (CO-WIN) సాఫ్ట్ వేర్, వ్యాక్సిన్ అందించే ప్రక్రియ, టీకా నిల్వలకు సంబంధించిన శీతల గిడ్డంగుల వ్యవస్థ నిర్వహణ, వ్యాక్సిన్ దుష్ప్రభావం ఎదుర్కోవడం, పర్యవేక్షణ వంటి అంశాలకు సంబంధించిన విషయాలను విడుదల చేసిన మార్గదర్శకాలలో పొందుపరిచింది.

కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మొత్తం 23 మంత్రిత్వ శాఖలను భాగస్వామ్యం చేయడంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియలో వాటి పాత్ర ఏ విధంగా ఉండాలనే విషయంపైనా కేంద్రం స్పష్టమైన సూచనలు చేసింది. ఎన్నికల పోలింగ్ బూత్ ల మాదిరిగానే వ్యాక్సిన్ సెంటర్లను ఏర్పాటు చేసి టీకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది.

CO-WIN సాఫ్ట్ వేర్ ద్వారా గుర్తించిన లబ్దిదారులకే టీకాలు వేయాలని, సాధారణ పౌరులు వ్యాక్సిన్ కోసం CO-WIN ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోదలిస్తే గుర్తింపు కార్డు తప్పనిసరి అని రాష్ట్రాలకు విడుదల చేసిన గైడ్ లైన్స్ లో కేంద్రం తెలిపింది. CO-WIN వెబ్ సైట్ లో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఓటర్ ఐడీ,పాస్ పోర్ట్,డ్రైవింగ్ లైసెన్స్,ఆధార్ కార్డు,పెన్షన్ డాక్యుమెంట్ తో కలిపి మొత్తం 12 ఫోటో-ఐడెంటిటీ డాక్యుమెంట్లు అవసరమని గైడ్ లైన్స్ లో తెలిపింది.

ఫేజ్-1 వ్యాక్సినేషన్ లో మొత్తం దాదాపు 30కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. మొదట హెల్త్ వర్కర్లకు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 50 ఏళ్లు పైబడినవారికి అంతకంటే తక్కువ వయసువారు ఉండి ఇతర రోగాలతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్ ఇస్తారు. ఓటరు కార్డు ఆధారంగా 50ఏళ్లు పైబడినవాళ్లను గుర్తించాలని సూచించింది. వీరందరికి ఏదో ఒక గుర్తింపు కార్డు ఇస్తారు. ఆ తర్వాత ఎవరైతే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి ఇస్తారు.

ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని, నేరుగా సెంటర్ల దగ్గరకు వచ్చిన వారికి వ్యాక్సిన్ ఇవ్వకూడదని కేంద్రం గైడ్ లైన్స్ లో సృష్టం చేసింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు టీకాను ఇవ్వాలని సూచించింది. వ్యాక్సిన్ తీసుకున్నప్రతి ఒక్క వ్యక్తిని 30నిమిషాల పాటు మానిటరింగ్ చేసి ఎవరికైనా రియాక్షన్ అయితే వెంటనే చికిత్స అందజేసేందుకు వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని కోరింది. కాగా, ఐదుగురు సభ్యులతో వ్యాక్సినేషన్ టీమ్ ఉండాలని… ఒక రోజులో ఒక్కో విడతలో 100-200 మంది లబ్ధిదారులకి వ్యాక్సిన్‌ అందించే ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు.

వివిధ రకాల వ్యాక్సిన్లతో గందరగోళం ఏర్పడకుండా నివారించేందుకు ఒక జిల్లాకు ఒకే సంస్థ టీకాను కేటాయించాలి. వ్యాక్సిన్​ క్యారియర్లు, నిలువ చేసే బాక్సులు, ఐస్​ ప్యాక్​లు నేరుగా సూర్యరశ్మి తలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.లబ్ధిదారుడు టీకా తీసుకునేందుకు కేంద్రానికి వచ్చే వరకు వ్యాక్సిన్​ ను క్యారియర్​ లోపలే ఉంచాలి. కొవిడ్​ టీకా లేబుల్​పై వ్యాక్సిన్​ వైయల్​ మానిటర్లు(వీవీఎం), గడువు ముగిసే తేదీ ఉండకపోయినా.. అలాంటి వాటిని వినియోగించకుండా పక్కన పెట్టకూడదు. టీకా పంపిణీ ముగిసిన తర్వాత అన్ని ఐస్​ ప్యాక్​లు, తెరవని వ్యాక్సిన్​ బాక్సులను తిరిగి కోల్డ్​ చైన్​ పాయింట్​కు పంపించాలి. వ్యాక్సినేషన్​ గురించి ప్రజల్లో నెలకొన్న భయాలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని గైడ్ లైన్స్ లో కేంద్రం పేర్కొంది.