Husband Carries Wife : పెళ్లి చీరలోనే వధువును ఎత్తుకెళ్లి.. మెచ్చుకోవాల్సిందే…

పెళ్లి చీరలోనే వధువును వరుడు ఎత్తుకెళ్లిన ఘటన బీహార్‌లోని కిషన్ గంజ్‌లో చోటు చేసుకుంది. ఆ వరుడు చేసిన పని వైరల్ గా మారింది. అతను అలా ఎందుకు చేశాడో తెలిశాక..

Husband Carries Wife : పెళ్లి చీరలోనే వధువును ఎత్తుకెళ్లి.. మెచ్చుకోవాల్సిందే…

Husband Carries Wife

Husband Carries Wife : పెళ్లి చీరలోనే వధువును వరుడు ఎత్తుకెళ్లిన ఘటన బీహార్‌లోని కిషన్ గంజ్‌లో చోటు చేసుకుంది. ఆ వరుడు చేసిన పని వైరల్ గా మారింది. అతను అలా ఎందుకు చేశాడో తెలిశాక.. అంతా… అయ్యో పాపం అని జాలి చూపించారు. బాధ్యత తెలిసిన భర్త అని కితాబిచ్చారు.

పెళ్లి దుస్తుల్లో ఉన్న వధువుని వరుడు తన భుజాలపై మోసుకుని తీసుకెళ్లడం.. సంప్రదాయమో.. లేక కొత్తగా ఉండాలన్న ఆకాంక్షో అనుకుంటే పొరపాటే. ఓ నది వరద దీనికి అసలు కారణం. కిషన్ జంజ్‌లోని సింధిగ్ మారి ఘాట్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ఇక్కడి కంకాయ్ నదికి వరదలు వచ్చాయి. దీంతో భారీ ప్రవాహంతో ఈ ప్రదేశం మొత్తం నీటితో నిండిపోయింది.

కాగా వస్లా గ్రామంలో శివకుమార్ సింగ్ అనే వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. వధూవరులతో పాటు కుటుంబ సభ్యులంతా నదికి అవతల ఉన్న తమ గ్రామానికి బోటులో బయల్దేరారు. అయితే నది ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల ఘాట్‌లో ఇసుక మేటలు వేసింది. దీంతో నది మధ్యలోనే ఇసుకలో బోటు కూరుకుపోయి ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అంతా బోటు దిగి కాలినడకన బయల్దేరేందుకు సిద్ధమయ్యారు. బంధువులంతా పడవ దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు. మిగతా వారి సంగతి అటుంచింతే పెళ్లి దుస్తుల్లో ఉన్న వధువు బోటు దిగడానికే ఇబ్బంది పడింది.

ఇది గ్రహించిన ఆ భర్త.. మరేమీ ఆలోచన చేయకుండా వెంటనే తన భార్యను భుజాలపైకి ఎత్తుకుని ముందుకు కదిలాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఆ భర్త చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అప్పుడే ఆ భర్త బాధ్యతను ఎత్తుకున్నాడని కామెంట్ చేశారు. అదే సమయంలో అక్కడ బ్ర్రిడ్జి నిర్మించాలన్న డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది.

బీహార్ లో ఏ మాత్రం వర్షం వచ్చినా ఈ నది ఉధృతంగా ప్రవహిస్తుందని, నదిని దాటడానికి తాము పడవలనే ఆశ్రయించాల్సి వస్తోందని పెళ్లి వారు వాపోయారు. ఎప్పుడో పదేళ్ల కిందట నిర్మించిన వంతెన కొట్టుకుపోయినా మళ్ళీ కొత్త వంతెన నిర్మాణానికి పూనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కంకాయ్ నదిపై బ్రిడ్జి కట్టాలని, తమ కష్టాలు తీర్చాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.