Covid-19: భర్త పోయాడన్న బాధలో భార్య ఆత్మహత్య.. తల్లివెంటే మూడేళ్ళ బాలుడు

Covid-19: భర్త పోయాడన్న బాధలో భార్య ఆత్మహత్య.. తల్లివెంటే మూడేళ్ళ బాలుడు

Covid 19 (4)

Covid-19: కరోనా మహమ్మారి మానవ జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. కుటుంబాలకు కుటుంబాలు దీని బారినపడి ఆరోగ్యపరంగా, ఆర్ధికంగా చితికిపోతున్నాయి. కరోనాతో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలు కోకొల్లలుగా ఉన్నాయి. ప్రతి రోజు ఎందరో కరోనాతో ప్రత్యేక్షంగా పరోక్షంగా యుద్ధం చేస్తున్నారు. ఇక గత కొద్దీ రోజులుగా దేశంలో పెరుగుతున్న కేసులు ప్రజలను మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి.

లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో బెంబేలెత్తిపోతున్నారు. గురు, శుక్రవారాల్లో దేశ వ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగా కరోనా కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో కరోనా కోరలు చాచింది. ఇక కరోనా బారినపడి మృతి చెందుతున్న వారి సంఖ్య కూడా అమాంతం పెరిగిపోతుంది…

ఇక ఇదిలా ఉంటే మహారాష్ట్రలో ఓ ఘోరం జరిగింది. తెలంగాణకు చెందిన ఓ కుటుంబ బ్రతుకుదెరువు కోసం మహారాష్ట్రకు వలస వెళ్ళింది. మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణంలో అద్దె ఇంట్లో ఉంటూ కూలి పనులు చేస్తూ గడుపుతున్నారు. ఉన్నటుండి ఈ కూలి కుటుంబంలో కరోనా పెద్ద కల్లోలం సృష్టించింది.

కొద్దీ రోజుల క్రితం కరోనా బారినపడి ఇంటి పెద్ద దిక్కు మరణించాడు. భర్త అనారోగ్యంతో బాధపడుతున్నా కనీసం సపర్యలు చేయలేని పరిస్థితి భార్యది.. భర్త మరణించినా దూరం నుంచే చివరి చూపు చూడాల్సి వచ్చింది. భర్త మృతి చెందటంతో మనోవేదనకు గురైన భార్య తన మూడేళ్ళ కొడుకు తీసుకోని సమీపంలోని చెరువు వద్దకు వెళ్ళింది. బాబును ఒడ్డుపై నిల్చోబెట్టి ఆమె చెరువులో దూకింది.

చెరువులోకి వెళ్లిన తల్లి ఎంతకు బయటకు రాకపోవడంతో ఆ మూడేళ్ళ బాబు బుడి బుడి అడుగులు వేసుకుంటూ చెరువులోకి దిగాడు. సమీపంలో ఉన్న ఓ వ్యక్తి బాలుడుని గమనించి పరుగుపరుగున చెరువు దగ్గరకు వచ్చాడు.. కానీ అప్పటికే ఆ బాలుడు నీటిలో మునిగి మృతి చెందాడు. దీంతో ఆ వ్యక్తి సమీపంలో ఉన్న కొందరిని తీసుకోని చెరువు వద్దకు వచ్చి బాలుడి మృతదేహం కోసం గాలిస్తుండగా అతడి తల్లి మృతదేహం కూడా లభ్యమయింది. దీంతో ఇద్దరినీ ఒడ్డుకు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. భర్త మృతి చెందటంతోనే ఆ బాధను తట్టుకోలేక మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తల్లి, తమ్ముడు మరణించారన్న వార్త తెలిసి మిగిలిన ఇద్దరు పిల్లలు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. తల్లిదండ్రులు ఇద్దరు లేక చివరకు పిల్లలు అనాథలుగా మిగిలారు. తెలిసిన వారు కూడా ఎవరు లేకపోవడంతో స్థానికులే పిల్లలిద్దరినీ దగ్గరకు తీశారు.