నన్ను బలిపశువును చేశారు..సచిన్ వాజే

రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు కేసులో మాజీ క్రైమ్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌(CIU) హెడ్‌ సచిన్‌ వాజే కస్టడీని పొడిగించాలన్న ఎన్ఐఏ అభ్యర్థనను గురువారం ముంబై కోర్టు అంగీకరించింది.

నన్ను బలిపశువును చేశారు..సచిన్ వాజే

I Am Being Made A Scapegoat Sachin Vaze Tells Nia Court

scapegoat రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు కేసులో మాజీ క్రైమ్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌(CIU) హెడ్‌ సచిన్‌ వాజే కస్టడీని పొడిగించాలన్న ఎన్ఐఏ అభ్యర్థనను గురువారం ముంబై కోర్టు అంగీకరించింది. నిజానికి ఆయన కస్టడీ నేటితో ముగిసింది. దీంతో ఇవాళ అధికారులు.. వాజేను ముంబైలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులో హాజరుపర్చారు. కేసు దర్యాప్తులో భాగంగా వాజేను మరో 15రోజులు కస్టడీకి అప్పగించాలని ఎన్ఐఏ కోరింది. అయితే వాజే తరపు న్యాయవాది దీనిని వ్యతిరేకించారు. అయినప్పటికీ,కోర్టు ఎన్ఐఏ విజ్ఞప్తి మేరకు వాజే కస్టడీని ఏప్రిల్ 3 వరకు పొడిగించింది.

మరోవైపు, ఇవాళ కోర్టులో వాదనల సందర్భంగా..తాను చేసినట్లు ఆరోపిస్తున్న నేరాలన్నింటితో తనకు ఎలాంటి సంబంధం లేదని సచిన్ వాజే తెలిపారు. తాను నేరాలను అంగీకరించినట్లు వార్తలు వచ్చాయని..కానీ అవి నిజం కాదన్నారు. ఇప్పటివరకు కేసు ఇన్వెస్టిగేషన్ లో తాను అధికారులకు సహకరించానని, తనను మళ్ళీ పోలీసు కస్టడీకి పంపరాదని సచిన్ వాజే కోర్టును కోరాడు. ఈ కేసులో తనను బలిపశువును చేశారని వాజే పేర్కొన్నారు. ఇక,వాజేపై “ఉపా(చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం)చట్టం”కింద కేసు పెట్టడాన్ని వాజే తరపు లాయర్ ఖండించారు. ఓ కమ్యూనిటీ లేదా దేశంపై దాడి చేసే ఉద్దేశ్యం వాజేకి లేనందువల్ల ఈ కేసులో ఉపా వర్తించదని వాజే తరపు లాయర్ వాదించారు. తన క్లయింటును అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని ఆయన పేర్కొన్నారు.

ఇక, వాజే ఇంటిలో తాము రిజిస్టర్ కాని 62 బులెట్లను కనుగొన్నట్టు ఎన్ఐఏ అధికారులు కోర్టుకి తెలిపారు. ఈయన సర్వీస్ రివాల్వర్ కోసం 30 బులెట్లు ఇవ్వగా 5 మాత్రమే కనుగొన్నామని, మిగిలినవన్నీ ఎక్కడ దాచాడో నిందితుడు చెప్ప‌డం లేద‌ని ఎన్ఐఏ త‌న పిటిష‌న్‌లో పేర్కొన్న‌ది. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు దొరికిన కారు యజమాని మాన్ సుఖ్ హిరేన్ మృతి కేసులో కూడా వాజేను ఎన్ఐఏ విచారిస్తోంది. ఈ కేసుకు సంబంధించి వాజే రక్త నమూనాలను డీఎన్ఏ కోసం తాము సేకరించామని, అలాగే ఇతని ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న 5 వాహనాలను కూడా మ్యాచింగ్ కి గాను వాటి శాంపిల్స్ సైతం కలెక్ట్ చేశామని అధికారులు కోర్టుకు తెలిపారు. సాక్ష్యాధారాలను నాశనం చేయడానికి వాజే యత్నించాడని వారు ఆరోపించారు. వాజే ఇంటి నుంచి 5 ఖరీదైన వాహనాలను పోలీసులు ఇటీవల సీజ్ చేశారు.