మమత విశ్వరూపం : సత్యాగ్రహానికి దిగుతున్నట్లు ప్రకటన

  • Published By: venkaiahnaidu ,Published On : February 3, 2019 / 03:16 PM IST
మమత విశ్వరూపం : సత్యాగ్రహానికి దిగుతున్నట్లు ప్రకటన

బీజేపీ బెంగాల్‌ని టార్చర్ చేస్తోందని ఆరోపించారు సీఎం మమతా బెనర్జీ. కేవలం తాను బ్రిగేడ్ ర్యాలీ నిర్వహించిన కారణంగానే బీజేపీ నేతలు బలవంతంగా బెంగాల్‌ను నాశనం చేయాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. దర్యాప్తు సంస్థలను కేంద్రప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు.శనివారం బెంగాల్ ర్యాలీలో ప్రధాని మోడీ.. భయపెడుతూ ఉపయోగించిన భాషను అందరూ చూశారని అన్నారు. కోల్ కతా సీపీ ఇంటి దగ్గర హైడ్రామా కొనసాగుతున్న సమయంలో మమత అక్కడి చేరుకుని సీపీని కలిసి మాట్లాడారు. అనంతరం ఆయన నివాసం బయట ఆమె మాట్లాడుతూ..ప్రపంచంలోనే సీపీ రాజీవ్ కుమార్ బెస్ట్ అని తాను ఇప్పటికీ చెబుతానని  అన్నారు.

 

సీబీఐ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మమత..ఎటువంటి నోటీసు లేకుండా సీబీఐ అధికారులు సీపీ ఇంటికి వచ్చారని, తాము సీబీఐ అధికారులను అరెస్ట్ చేసి ఉండవచ్చు కానీ తాము వారిని వదిలేశామని తెలిపారు. ఈ రోజు సీపీ ఇంటి దగ్గర జరిగిన దానికి తాను చాలా భాధపడుతున్నానని మమత తెలిపారు. ఫెడరల్ స్ట్రక్చర్ ని సేవ్ చేసేందుకు తాను ధర్నా చేయబోతున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ రోజు నుంచే మెట్రో చానల్ దగ్గర ధర్నాకి దిగుతున్నట్లు తెలిపారు. ఈ ధర్నా అర్థం సత్యాగ్రహ అని తెలిపారు.

 

శారదా చిట్ ఫండ్ స్కామ్ కి సంబంధించి కోల్ కతా  పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ని విచారించేందుకు కోల్ కతాలోని ఆయన నివాసానికి ఆదివారం సాయంత్రం చేరుకున్న సీబీఐ అధికారుల బృందాన్ని గేటు బయటే బెంగాల్ పోలీసులు అడ్డుకున్నారు. ఐదుగురు సీబీఐ అధికారులను బెంగాల్ పోలీసులు అదుపులోకి తీసుకొని  స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించారు. సీపీని పరామర్శించేందుకు సీఎం, డీజీపీ, కోల్ కతా మేయర్ తదితరులు ఆయన నివాసానికి చేరుకున్నారు. మరోవైపు మమత సర్కార్ తీరుపై సోమవారం సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉంది సీబీఐ.