కేంద్రంపై పంజాబ్ సీఎం సమరం….అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా మూడు బిల్లులు

  • Published By: venkaiahnaidu ,Published On : October 20, 2020 / 08:07 PM IST
కేంద్రంపై పంజాబ్ సీఎం సమరం….అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా మూడు బిల్లులు

Punjab CM moves resolution against farm laws వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం అంటూ ఇటీ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్,హర్యానా రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇవాళ పంజాబ్ ప్ర‌భుత్వం నూతన వ్యవసాయ చట్టాలకు వ్య‌తిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ప్ర‌వేశ‌పెట్టింది. కేంద్రం తెచ్చిన మూడు చ‌ట్టాలు రైతుల‌కు వ్య‌తిరేకంగా ఉన్నాయ‌ని త‌న తీర్మానంలో సీఎం అమ‌రీంద‌ర్ ఆరోపించారు. ఈ మూడు చ‌ట్టాల‌ను ఏక‌ప‌క్షంగా స‌భ వ్య‌తిరేకిస్తున్న‌ట్లు అమ‌రీంద‌ర్ చెప్పారు. వ్యవసాయ చట్టాలతో పాటుగా విద్యుత్తు స‌వ‌ర‌ణ బిల్లుని కూడా వ్య‌తిరేకిస్తున్నామ‌ని, ఈ చ‌ట్టాలు పంజాబ్‌, హ‌ర్యానా, ప‌శ్చిమ యూపీ రైతుల‌కు వ్య‌తిరేకంగా ఉన్నాయ‌న్నారు.



3 వ్యవసాయ చట్టాలను వ్య‌తిరేకిస్తూ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ రెండు రోజుల ప్ర‌త్యేక అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ రెండు రోజు అసెంబ్లీ సమావేశాల సంద‌ర్భంగా.. పార్ల‌మెంట్ ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను వ్య‌తిరేకిస్తూ సీఎం అమరీందర్ సింగ్.. అసెంబ్లీలో మూడు బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్టారు.



కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు కౌంటర్ గా కొత్తగా మూడు బిల్లులు…..ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్(ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్)స్పెషల్ ప్రొవిజన్స్ అండ్ పంజాబ్ అమెండ్ మెంట్ బిల్లు-2020, ఎసెన్షియల్ కమోడిటీస్(స్పెషల్ ప్రొవిజన్స్ అండ్ పంజాబ్ అమెండ్ మెంట్)బిల్లు-2020, ఫార్మర్స్ (ఎంపర్ మెంట్ అండ్ ప్రొటక్షన్)అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ ఎస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్(స్పెషల్ ప్రొవిజన్స్ అండ్ పంజాబ్ అమెండ్ మెంట్)బిల్లు-2020ని అసెంబ్లీలో అమరీందర్ ప్రవేశపెట్టారు. ఈ మూడు బిల్లులు రాష్ట్రం ముందు ముందు న్యాయపోరాటంలో ముందుకు సాగుతున్నట్లు తెలిపేవని ఈ సందర్భంగా సీఎం అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించారు. అయితే బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్టిన తీరును ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేలు వ్య‌తిరేకించారు. సోమ‌వారం సాయంత్రం నుంచి ఆ ఎమ్మెల్యేలు అంతా బిల్లుల‌ను వ్య‌తిరేకిస్తూ స‌భ‌లోనే నిద్ర‌పోయారు.



అసెంబ్లీలో మూడు తీర్మాణాలు ప్రవేశపెట్టే సమయంలో అమరీందర్ మాట్లాడుతూ….తాను రాజీనామా గురించి భయపడనని…తన ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసినా తాను భయపడనని…కానీ రైతులను మాత్రం ఇబ్బందికి గురికానివ్వనని వ్యాఖ్యానించారు. పరిస్థితిని చేయిదాటేదాకా కేంద్రం తీసుకొస్తుందని…కేంద్రం 3వ్యవసాయ చట్టాలని రద్దు చేయకపోతే..రైతులతో కలిసి యువత కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళనల్లో పాల్గొంటారన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు పంజాబ్ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే విధంగా ఉన్నట్లు అమరీందర్ చెప్పారు. 1980ల్లో లేక 1990ల్లో గానీ ఇలా జరిగి ఉండి ఉంటే సిక్కు తీవ్రవాద గ్రూప్ పంజాబ్ ని తమ గుప్పిట్లో పెట్టుకొని ఉండేదని అన్నారు. పాకిస్థాన్,చైనా రెండూ కమ్మక్కయి పంజాబ్ రాష్ట్రంలో శాంతి విఘాతం కలిగించే చర్యలలో వేలు పెడతాయని,దాంతో జాతీయ భద్రతకు పెద్ద ప్రమాదం ఏర్పడిద్దని ఆయన అన్నారు. పార్టీలన్నీ తమ రాజకీయాలను పక్కకుపెట్టి పంజాబ్ ను కాపాడేందుకు కలిసి ముందుకుసాగాలని చెప్పారు.