హిందుస్తానీ ముస్లింగా గర్వపడుతున్నా : ఆజాద్

హిందుస్తానీ ముస్లింగా గర్వపడుతున్నా : ఆజాద్

Azad రాజ్యసభ ఎంపీగా పదవీ విరమణ ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్​ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్​. హిందుస్థానీ ముస్లింగా ఉండటం పట్ల గర్వంగా ఉందన్నారు. ఇండియా ఎప్పుడూ స్వర్గం అని తాను భావిస్తుంటానన్నారు. స్వాతంత్ర్యం తర్వాత తాను పుట్టానని అన్నారు. దేశ విభజన సమయంలో పాకిస్తాన్ కి వెళ్లని అదృష్టవంతులలో తానూ ఒకడినన్నారు.

పాకిస్థాన్​లో పరిస్థితుల గురించి చదివినప్పుడు.. హిందుస్తానీ ముస్లింగా ఉండటం పట్ల గర్వపడుతున్నానని ఆజాద్ తెలిపారు. తన రాజకీయ జీవితంలో ఎంతో నేర్చుకున్నట్లు ఆయన తెలిపారు. ఇందిరా గాంధీ, రాజీవ్​ గాంధీ, అటల్​ బిహారి వాజ్​పేయీ నుంచి చాలా నేర్చుకున్నట్లు చెప్పారు. తాను కశ్మీర్ సీఎంగా ఉన్న సమయంలో జరిగిన ఉగ్రదాడిని గుర్తుచేసుకున్న ఆజాద్..భారత్​లో ఉగ్రవాదం అంతమవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

ఇక,అంతకుముందు రాజ్యసభ ఎంపీలు గులాం నబీ ఆజాద్​, మిర్​ మొహమ్మద్​ ఫయాజ్​, షాంసెర్​ సింగ్​, నజిర్​ అహ్మెద్​ లావయ్​లు పదవీ విరమణ పొందనున్న నేపథ్యంలో వారికి వీడ్కోలు పలికారు ప్రధాని మోడీ. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్​పై ప్రశంసలు కురిపించారు మోడీ. ఆజాద్ గురించి మాట్లాడుతోన్న సమయంలో ప్రధాని భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఆజాద్ కి సెల్యూట్ చేశారు మోడీ. ప్రజల కోసం ఆజాద్ చేసిన సేవకు దేశం కృతజ్ఞతలు తెలుపుతుందన్నారు. గులాం నబీ ఆజాద్ (రాజ్యసభలో ప్రతిపక్ష నేత)​ స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తి ఆయన పనితీరును అందుకోవటం చాలా కష్టమన్నారు. ఆజాద్​.. తన పార్టీ కోసమే కాకుండా దేశం, పార్లమెంట్​ కోసం పని చేశారని ప్రధాని అన్నారు.