హిందుత్వంలో నాతో ఎవరూ పోటీపడలేరు..బీజేపీకి మమత హెచ్చరిక

హిందుత్వంలో నాతో ఎవరూ పోటీపడలేరు..బీజేపీకి మమత హెచ్చరిక

MAMATA పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి సీఎం మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. నందిగ్రామ్ టీఎంసీ అభ్యర్థిగా బుధవారం ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నందిగ్రామ్​లోని టీఎంసీ కార్యకర్తలనుద్దేశించి మమత ప్రసంగించారు. మమత బెనర్జీ నందిగ్రామ్‌కు స్థానికేతర వ్యక్తి అని బీజేపీ నేత సువెందు అధికారి చేస్తోన్న విమర్శలపై ఈ సందర్భంగా ‘దీదీ’ ఘాటుగా స్పందించింది.

గుజరాత్ నుంచి వచ్చినోళ్లు స్థానికులా

మమత మాట్లాడుతూ..నన్ను బయటి వ్యక్తిగా కొందరు అభివర్ణిస్తున్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. పక్కనే ఉన్న భీర్భూమ్​ జిల్లాలో నేను పుట్టాను. అక్కడే పెరిగాను. నన్ను బయటి వ్యక్తిగా ఆరోపిస్తున్న మనిషి(సువేందు) కూడా ఇక్కడ పుట్టలేదు. వారికి.. ఈరోజున నేను బయటి వ్యక్తిగా మారాను. గుజరాత్​ నుంచి వస్తున్న వారే వారికి సొంత మనుషులయ్యారని మమత విమర్శించారు. తనని తాను భూమిపుత్రుడు అని చెప్పుకుంటున్న సువేందు అధికారి పై నిప్పులు చెరిగిన మమతాబెనర్జీ బయటి వ్యక్తుల పార్టీలో చేరిన సువేందు అధికారి భూమి పుత్రుడను అని ఆ విధంగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.

హిందుత్వంలో నాతో పోటీ పడలేరు

హిందుత్వం విషయంలో నాతో ఎవరూ పోటీ పడలేరు. అందరూ ఒక విషయం గుర్తుంచుకోవాలి. నేను మార్కండేయ పురాణంలోని చంఢీపాఠం జపించాకే ఇంటి నుంచి బయటకు వస్తాను. 70:30 నిష్పత్తి(హిందూ-ముస్లిం జనాభా) గురించి మాట్లాడేవారు… ఆ పవిత్ర మంత్రాన్ని అవమానించినవారు అవుతారు. అలాంటి వారంతా నేను చంఢీపాఠం జపించడం చూడాలి. అప్పుడు వారెవరూ హిందుత్వం విషయంలో నాతో పోటీపడరు అని అంటూ సభలోనే చంఢీపాఠం జపించారు మమత. హిందువులు, ముస్లింల మధ్య వివక్ష చూపే బీజేపీ నాయకులు ముందుగా మీరు మంచి హిందువు అవునో కాదో నిరూపించుకోవాలన్నారు . ఆపై మీరు నాతో హిందూ గేమ్ ఆడవచ్చు అని మమతా బెనర్జీ అన్నారు. తమ ఆత్మలను గుజరాత్ నుండి వచ్చిన బయటివారికి అమ్మినవారు మతరాజకీయాలతో నందిగ్రామ్ ఉద్యమాన్ని అవమానిస్తున్నారని పరోక్షంగా సువెందు అధికారిపై మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు.

ఏప్రిల్ ఫూల్ చేయండి
ఈ సందర్భంగా ఏప్రిల్ 1వ తేదీన బీజేపీ వాళ్లు ప్రజల జేబుల్లోకి డబ్బులు పెట్టి ఓట్లు అడిగే వారిని ఏప్రిల్ ఫూల్ చేయాలని మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. తాను ఓట్ల కోసం ప్రజలను డబ్బులతో మభ్యపెట్టలేదని , ప్రజల ఆశీస్సులతో తాను రాజకీయాలు చేస్తానని మమతా బెనర్జీ పేర్కొన్నారు. నందిగ్రామ్ లో ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోందని అన్నారు. నందిగ్రామ్ ప్రజలు, రైతులు ఇంతకు ముందు గూండాలకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. నందిగ్రామ్ రైతుల సమస్యలను పరిష్కరించడం తన కర్తవ్యంగా భావిస్తున్నానని , రైతుల హక్కు కోసం నేను ఎప్పుడూ పోరాడుతాను అని మమతా బెనర్జీ అన్నారు.