రూ. 91 లక్షల అప్పు తీర్చడానికి కిడ్నీ అమ్మకానికి పెట్టిన కార్ల వ్యాపారి

రూ. 91 లక్షల అప్పు తీర్చడానికి కిడ్నీ అమ్మకానికి పెట్టిన కార్ల వ్యాపారి

I want to sell my kidney : రూ. 91 లక్షల అప్పులు చెల్లించలేక ఓ వ్యక్తి అష్టకష్టాలు పడుతున్నాడు. చివరకు తన కిడ్నీని విక్రయించేందుకు సిద్ధ పడ్డాడు. కిడ్నీ అమ్మకం కోసం..ఓ వార్తా పత్రికలో ప్రకటన ఇవ్వడం చర్చనీయాంశమైంది. కిడ్నీ అవసరం ఉన్న వారు తనను కాంటాక్ట్ చేయవచ్చని తెలిపాడు. ఈ ఘటన కాశ్మీర్‌లో చోటు చేసుకుంది.

కరోనా రాకాసి వల్ల ఎంతో మంది కుదేలైపోయారు. ఆర్థికంగా తీరని నష్టం చవి చూశారు. లాక్ డౌన్ కారణంగా..వ్యాపారాలు దివాళా తీయడంతో అప్పుల పాలయ్యారు. అప్పులు తీర్చేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. కాశ్మీర్ లోని కుల్గామ్ జిల్లాకు చెందిన సబ్జర్ అహ్మద్ ఖాన్ (28) అనే వ్యక్తి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇతను Nussu village వాసి. కార్ డీలర్ గా వ్యవహరిస్తున్నాడు.

కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 తర్వాత కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా..ఈ సంవత్సరంలో కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో వ్యాపారంలో ఇతనికి నష్టాలు ఎదురయ్యాయి. బ్యాంకులకు రూ. 61 లక్షలు, ఇతరులకు రూ. 30 లక్షలు బాకీ పడ్డాడు. అప్పులు తీర్చేందుకు చాలా ప్రయత్నాలే చేశాడు. ఇక తన కిడ్నీని అమ్మకం పెట్టాలని అనుకున్నాడు. ఇందుకోసం ఓ కాశ్మీర్ పత్రికలో ప్రకటన ఇచ్చాడు. ఈ విషయం కుటుంబసభ్యులకు కూడా చెప్పానన్నాడు.

ఈ ప్రకటన చూసిన కొంతమంది తనను సంప్రదించినట్లు, ఒకరు రూ. 20 లక్షలు, మరొకరు రూ. 25 లక్షలు ఇస్తామని చెప్పారన్నారు. ఇందుకు తాను ఒప్పుకోలేదన్నాడు. బెస్ట్ ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్నానని సబ్జర్ అహ్మద్ ఖాన్ తెలిపాడు.