క్షమాపణ చెప్పేది లేదు : రజనీ కాంత్

  • Published By: chvmurthy ,Published On : January 21, 2020 / 05:33 AM IST
క్షమాపణ చెప్పేది లేదు : రజనీ కాంత్

ద్రవిడ పితామహుడు, సంఘ సంస్కర్త..పెరియార్ రామసామి పై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పేది లేదని తలైవర్ రజనీ కాంత్ స్పష్టం చేశారు. నేను చేసిన వ్యాఖ్యలు నేను రాసుకున్నవి కాదని…. వాటిపై పత్రికల్లో కధనాలు కూడా వచ్చాయని, కావాలంటే వాటిని చూపిస్తానని ఆయన చెప్పారు. 

జనవరి 14 న జరిగిన తుగ్లక్ పత్రిక స్వర్ణోత్సవ  సభలో పాల్గోన్నరజనీకాంత్  పెరియార్ రామసామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. 1971లో పెరియార్‌ సేలంలో జరిగిన సభలో శ్రీరాముడు, సీతాదేవి విగ్రహాలకు నగ్నంగా చెప్పుల దండవేసి ఊరేగించారని, ఆ వార్తను ఏ పత్రికా ప్రచురించకపోయినా తుగ్లక్‌ పత్రిక మాజీ సంపాదకుడు చో రామసామి ప్రచురించారని పేర్కొన్నారు.
 
పెరియార్‌ను కించపరస్తూ  రజనీ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ ద్రావిడర్‌ విడుదలై కళగం నేతలు చెన్నై ట్రిప్లికేన్‌, తిరుప్పూరు, కోయంబత్తూరు, తిరుచెంగోడు, మదురై పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేశారు. రజనీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డీపీఐ నేత తొల్‌ తిరుమావళవన్‌ డిమాండ్‌ చేశారు.

అప్పటి నుంచి తమిళనాడులో రజనీకి వ్యతిరేకంగా ద్రవిడ సంఘాలు నిరసన తెలుపుతూనే ఉన్నాయి. కాగా ….తంతై పెరియార్ ద్రవిదార్ కజగం  నాయకులు రజనీకాంత్ ఇంటి వద్ద మంగళవారం నిరసన ప్రదర్శన చేపట్టారు.