బెంగాల్..కశ్మీర్ లా మారితే తప్పేంటి? : ఒమర్ అబ్దుల్లా

బెంగాల్..కశ్మీర్ లా మారితే తప్పేంటి? : ఒమర్ అబ్దుల్లా

Omar Abdullah’s dig at Suvendu వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే బెంగాల్​.. కశ్మీర్​లా తయారవుతుందన్న బీజేపీ నేత సువేందు అధికారి వ్యాఖ్యలను ఖండించారు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా. ఆయన వ్యాఖ్యలు అవివేకమైనవన్నారు. 2019 ఆగస్టులో కేంద్రప్రభుత్వం కశ్మీర్​లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత..కశ్మీర్​ స్వర్గంలా మారిందని బీజేపీ తెలిపింది. మరి ఇప్పుడు బెంగాల్​.. కశ్మీర్​లా మారితే తప్పేంటి? ఏదేమైనా..బెంగాల్​ ప్రజలు కశ్మీర్​ను ప్రేమిస్తారు అని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.

కాగా, ఇవాళ బెహాలాలో నిర్వహించిన పార్టీ కార్యక్రమానికి హాజరైన సువెందు అధికారి సీఎం మమతా బెనర్జీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. శ్యామా ప్రకాశ్ ముఖర్జీ లేకపోయుంటే భారత్​ ఇస్లామిక్​ దేశంలా మారిపోయేది.. మనం బంగ్లాదేశ్​లో నివసిస్తుండేవాళ్లం. తృణమూల్ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే బంగాల్​ మరో కశ్మీర్​లా తయారవుతుందని సువెందు అధికారి వ్యాఖ్యానించారు. మరోవైపు, నందిగ్రామ్ నియోజకవర్గంలో మమతకు పోటీగా బరిలోకి దిగుతానని సువేందు అధికారి ఇప్పటికే ప్రకటించారు. మమతపై 50,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తానని సవాల్ విసిరారు.

ఇక,294 స్థానాలున్న వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ మార్చి-27 నుంచి ఏప్రిల్-29వరకు ఎనిమిది దశల్లో జరగనున్నాయి. మార్చి-27న మొదటి దశ,ఏప్రిల్-1న రెండో దశ,ఏప్రిల్-6న మూడో దశ,ఏప్రిల్-10న నాల్గవ దశ,ఏప్రిల్-17న ఐదవ దశ,ఏప్రిల్-22న ఆరవ దశ,ఏప్రిల్-26న ఏడవ దశ,ఏప్రిల్-29న ఎనిమిదశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మే-2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.