ఆర్టికల్ 370 తొలగిస్తే బంధం ముగిసినట్లే : మెహబూబా ముఫ్తీ 

  • Published By: chvmurthy ,Published On : March 30, 2019 / 12:50 PM IST
ఆర్టికల్ 370 తొలగిస్తే బంధం ముగిసినట్లే : మెహబూబా ముఫ్తీ 

శ్రీనగర్: ఆర్టికల్ 370 ని కేంద్ర ప్రభుత్వం తొలగిస్తే భారత్ తో, జమ్మూ కాశ్మీర్ కు ఉన్న బంధం ముగిసినట్లేనని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహాబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఆర్టికల్ 370 భారత్ తో జమ్మూ కాశ్మీర్ కలిపి ఉంచుతున్న ఒప్పందమని , దానిని తొలగిస్తే భారత్ తోకలిసి ఉండాలా వద్దా అనేది ఆలోచించాల్సి ఉంటుందని, అప్పుడు మరి కొన్ని కొత్త కండీషన్లు తెరపైకి వస్తాయని ఆమె అన్నారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ  ఇటీవల ఆర్టికల్ 35 ఏ కొనసాగింపు పై పునరాలోచన చేయాలని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.  ముస్లిం మెజార్టీగా ఉన్న రాష్ట్రం భారత్ తో కలిసి ఉందంటే దానికి కారణం ఆర్టికల్ 370యే కారణమని ఆమె  అన్నారు. గత సంవత్సరంలో కూడా ఆమె ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. ఆర్టికల్ 35  ఏ తొలగిస్తే కాశ్మీర్లో జాతీయ జెండా కూడా పుచ్చుకునే వారుండరని  ఆమె అన్నారు.  

ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 ఏ ద్వారా జమ్మూ కాశ్మీర్ కు  ప్రత్యేక హక్కులు ఉంటాయి.ఆర్టికల్ 35 ఏ జమ్మూ కాశ్మీర్  అసెంబ్లీకి ఆ రాష్ట్రంలో నివసించే శాశ్వత నివాసితులకు సంబంధించి విశేష అధికారాలు కల్పించింది.  జమ్మూ కాశ్మీర్ లో ఇతర ప్రాంత ప్రజలు ఎలాంటి ఆస్తులు కొనుగోలు చేయకుండా ఈ ఆర్టికల్స్ అడ్డుకుంటున్నాయి. ఈ పరిస్ధితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం వీటిలో మార్పులు చేయటమో, లేదా పూర్తిగా తొలగించటమో చేయాలని యోచిస్తోంది. కాశ్మీర్ కు  ఆర్టికల్ 370  అనేది వారధి లాంటిదని  కేంద్రం ఆప్రయత్నాలు మానుకోవాలని మెహబూబా ముఫ్తీ హెచ్చరించారు.