Illegal Liquor: ఫారెన్ బ్రాండెడ్ కంపెనీల స్టిక్కర్లతో నకిలీ మద్యం తయారీ

ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌ఘుర్ జిల్లాలో అక్రమ మద్యం కర్మాగారంపై పోలీసులు దాడి చేశారు. సెర్చింగ్ ఆపరేషన్‌కు వెళ్లిన పోలీసులు షాకింగ్ విషయాలు గుర్తించారు.

10TV Telugu News

Illegal Liquor Factory: ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌ఘుర్ జిల్లాలో అక్రమ మద్యం కర్మాగారంపై పోలీసులు దాడి చేశారు. సెర్చింగ్ ఆపరేషన్‌కు వెళ్లిన పోలీసులు షాకింగ్ విషయాలు గుర్తించారు. ఇక్కడ, బ్రాండెడ్ కంపెనీల ఇంగ్లీష్ మద్యం ఇంట్లో తయారు చేసి విక్రయిస్తున్నారు. పోలీసుల దాడిలో, 101 బాక్సుల అక్రమ మద్యం, పెద్ద మొత్తంలో బ్రాండెడ్ కంపెనీల స్టిక్కర్లు స్వాధీనం చేసుకున్నారు. మద్యం తయారీకి అత్యాధునిక పరికరాలు, బ్రాండెడ్ బాటిల్స్ మరియు మూతలు ఉపయోగిస్తున్నారు. వాటిని స్వాధీనం చేసుకున్న తరువాత ఒక మహిళతో సహా ఐదుగురిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ లిక్కర్ మాఫియా వెనకాల పెద్ద తలకాయలే ఉన్నట్లుగా ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. 2009 సంవత్సరంలో, బర్దా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఇర్ని గ్రామంలో ఒక డజను మంది నకిలీ మద్యం సేవించి మరణించగా, చాలామంది కంటి చూపు కోల్పోయారు. దీని తరువాత పోలీసులు మద్యం మాఫియాపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ ప్రాంతంలో అక్రమ మద్యం వ్యాపారం నడుస్తుందనే అనుమానంతో అప్పటి నుంచి పోలీసులు నిఘా ఉంచారు. అయితే మరో 12 సంవత్సరాల తరువాత అదే పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఫతుహి గ్రామంలో పోలీసుల దాడిలో పెద్ద ఎత్తున అక్రమ మద్యం దొరికింది.

ఖచ్చితమైన సమాచారం వచ్చిన తరువాత SWAT మరియు బర్దా పోలీస్ స్టేషన్ పోలీసులు ఒక ఇంటిపై దాడి చేశారు. దాడి సమయంలో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు ఇంటిని శోధించినప్పుడు, ఇంటి లోపల నుండి 101 పెట్టెల్లో మొత్తం ఐదువేల బాటిళ్ల బ్రాండెడ్ మద్యం, నాలుగు డ్రమ్‌లలో మొత్తం 800 లీటర్ల స్పిరిట్, పెద్ద మొత్తంలో ఇంగ్లీష్ మద్యం బాటిల్స్, మూతలు, రేపర్లు మరియు మద్యం తయారీ యంత్రాలు, ఇతర పరికరాలు దొరికాయి.

సిటీ పోలీస్ సూపరింటెండెంట్ పంకజ్ పాండే మాట్లాడుతూ.. బర్దా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి వినయ్ మిశ్రా, స్వాట్ ఇన్‌ఛార్జిలు అక్రమ మద్యం కర్మాగారంపై దాడి చేశారని వెల్లడించారు. ఒక మహిళతో సహా ఐదుగురిని అక్కడి నుంచి అరెస్టు చేశారు. వారిని కఠినంగా విచారించగా.. ఇంకా చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయని, వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.

10TV Telugu News