‘నేను ముస్లిం కాదు.. ఉద్యమంలో ముందుంటా’

‘నేను ముస్లిం కాదు.. ఉద్యమంలో ముందుంటా’

ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు జరిపిన దాడి బీభత్సాన్ని సృష్టించింది. పౌరసత్వపు బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనకారులు చేపడుతున్న నిరసనలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. వాటిని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీ చార్జీలు, టియర్ గ్యాస్ చల్లడం లాంటివన్నీ చేస్తున్నారు. పోలీసులు అదుపుచేస్తున్నప్పటికీ విద్యార్థులు వెనుకడుగేయడం లేదు. 

‘ఢిల్లీ విద్యార్థులకు సేఫ్ అని అనుకుంటాం. అదీగాక ఇది కేంద్రీయ విశ్వ విద్యాలయం. ఈ యూనివర్సిటీలో మాకెలాంటి హానీ జరగదు. ఇది చాలా సేఫ్ ప్రదేశంగా అనుకున్నా. కానీ, రాత్రంతా ఏడుస్తూనే ఉన్నా. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు’ అని ఓ స్టూడెంట్ వాపోయింది. 

యావత్ దేశం సురక్షితంగా ఉందని అనుకోవడం లేదు. ఇలా ఉంటే నాకెక్కడికిపోవాలో తెలియడం లేదు. రేపు అనే రోజున నా స్నేహితులు భారతీయులుగానే ఉంటారా అనే సందేహం కలుగుతోంది. నేను ముస్లింని కాదు. అయినా మొదటి రోజు నుంచి ఉద్యమంలో ముందున్నా. సరైనదాని వైపు నిలబడకపోతే ఈ చదువుకు ప్రయోజనం ఏంటి?’ అని ఆ స్టూడెంట్ ప్రశ్నించింది. 

‘ఈ ఘటన మొదలైనప్పుడు నేను లైబ్రరీలో ఉన్నా. సూపర్‌వైజర్ నుంచి విషయం తెలిసింది. పరిస్థితి బాగాలేదని చెప్పారు. బయటకు పారిపోదామనుకుంటే నిమిషాల్లో లైబ్రరీ నిండిపోయింది. కిటికీ అద్దాలు పగలడం, కొందరు పోలీసులు లోపలికి వచ్చి దుర్భలాష ఆడారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ ఆదేశించారు’

‘మమ్మల్ని చేతులు పైకెత్తి నడవాలంటూ చెప్పారు. అలాగే హాస్టల్ కు చేరుకున్నాం. ఈలోగా కొందరు స్టూడెంట్స్ పరుగెత్తుకుంటూ వచ్చి మహిళా పోలీసులు కొట్టడానికి వస్తున్నారని చెప్పారు. అక్కడే ఉన్న పొదల్లో దాక్కున్నా. కాస్త సమయంలో బయటకు వచ్చి చూశా. మిగిలిన స్టూడెంట్ల షర్ట్ లపై రక్తపు మరకలు కనిపించాయి’ అని ఆ స్టూడెంట్ ఆవేదన వ్యక్తం చేసింది.