IMA Lockdown : ఇప్పటికైనా మేల్కోండి, దేశవ్యాప్త లాక్‌డౌన్‌ పెట్టండి.. కేంద్రానికి IMA ఘాటు లేఖ

దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు, పాజిటివ్ కేసులను అదుపులోకి తెచ్చేందుకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ పెట్టాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (IMA) కేంద్రాన్ని కోరింది. దీనివల్ల వైరస్‌ చైన్‌ను బ్రేక్‌ చేయడంతో పాటు కొవిడ్‌ రోగులకు

IMA Lockdown : ఇప్పటికైనా మేల్కోండి, దేశవ్యాప్త లాక్‌డౌన్‌ పెట్టండి.. కేంద్రానికి IMA ఘాటు లేఖ

Ima Lockdown

IMA Lockdown : దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు, పాజిటివ్ కేసులను అదుపులోకి తెచ్చేందుకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ పెట్టాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (IMA) కేంద్రాన్ని కోరింది. దీనివల్ల వైరస్‌ చైన్‌ను బ్రేక్‌ చేయడంతో పాటు కొవిడ్‌ రోగులకు నిరంతరాయంగా సేవలు అందిస్తున్న మెడికల్‌ సిబ్బందికి కొంతమేర స్వస్థత చేకూరుతుందని అభిప్రాయపడింది. కొవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ కారణంగా తలెత్తిన సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇప్పటికైనా మేల్కోవాలంటూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు ఐఎంఏ ఘాటు లేఖ రాసింది. సెకండ్‌వేవ్‌ వేళ ఆ శాఖ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే తమకు ఆశ్చర్యమేస్తోందని చెప్పింది. తమ అసోసియేషన్‌ నుంచి కేంద్రానికి ఇచ్చిన సలహాలు, సూచనలు పలుమార్లు బుట్టదాఖలు అయ్యాయని వాపోయింది.

ప్రస్తుతం దేశంలో విజృంభిస్తున్న వైరస్‌ను అదుపులోకి తేవాలంటే ప్రణాళికతో కూడిన లాక్‌డౌన్‌ను విధించాలని తన లేఖలో ఐఎంఏ విజ్ఞప్తి చేసింది. రాష్ట్రాలు అమలు చేస్తున్న 10-15 రోజుల లాక్‌డౌన్‌ కాకుండా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అవసరమంది. అలాగే, రాత్రిపూట కర్ఫ్యూలు విధించడం వల్ల కూడా పెద్దగా ప్రయోజనం లేదంది. ఆర్థికం కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమని అభిప్రాయపడింది.

కేంద్రం చేపట్టిన వ్యాక్సినేషన్‌ ప్రణాళికనూ తప్పుబట్టింది. ముందుచూపు లేకపోవడం వల్లే ఇప్పటికీ చాలా చోట్ల 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ అందించలేని పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది. పోలియో, మశూచి వంటి వ్యాధులకు సార్వత్రిక టీకా విధానాన్ని అవలంబించిన కేంద్రం.. ఇప్పుడెందుకు వేర్వేరు ధరలకు టీకాలు అందజేయాల్సి వస్తోందని ప్రశ్నించింది. ఆక్సిజన్‌ కొరత, వైద్యులు వైరస్‌ బారిన పడడం వంటి సంఘటలనపై ఆందోళన వ్యక్తంచేసింది. ప్రజా వైద్యానికి జీడీపీలో 8 శాతం మేర కేటాయింపులు జరపాలని తన లేఖలో సూచించింది.

ఒక్కరోజే 4వేలకు పైగా మరణాలు:
దేశంలో కరోనా మహమ్మారి మరణమృదంగం కొనసాగుతోంది. నిత్యం లక్షల మందిపై విరుచుకుపడుతున్న ఈ మహమ్మారి.. తాజాగా ఒక్కరోజే 4వేలకుపైగా ప్రాణాలను బలి తీసుకుంది. దేశంలోకి కొవిడ్‌ ప్రవేశించినప్పటి నుంచి ఈ స్థాయిలో మరణాలు నమోదవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక వరుసగా మూడో రోజు 4 లక్షలకు పైనే కొత్త కేసులు నమోదవడం మహమ్మారి తీవ్రతకు అద్దం పడుతోంది. శుక్రవారం(మే 7,2021) ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 18,26,490 మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించగా.. 4,01,078 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.18కోట్లకు చేరింది.

ఇదే సమయంలో 4వేల 187 మంది కరోనాతో మృత్యుఒడికి చేరుకున్నారు. దీంతో వైరస్‌ ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు 2,38,270 మందిని కొవిడ్‌ బలితీసుకుంది. మరణాల రేటు 1.09శాతంగా ఉంది. అయితే కొత్త కేసులతో పాటు రికవరీలు కూడా ఎక్కువగానే ఉంటుండం కాస్త సానుకూల పరిణామం. గడిచిన 24 గంటల్లో దాదాపు 3,18,609 మంది కరోనాను జయించారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1.79కోట్లకు చేరగా.. రికవరీ రేటు 81.95శాతంగా ఉంది.

ఇక కొత్త కేసులు భారీగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు 37లక్షలు దాటాయి. ప్రస్తుతం 37,23,446 మంది వైరస్‌కు చికిత్స తీసుకుంటుండగా.. క్రియాశీల రేటు 16.96 శాతంగా ఉంది.