ఐఎంఏ షాక్ : పతంజలి”కరొనిల్​”తో కేంద్ర ఆరోగ్య మంత్రికి చిక్కులు

ఐఎంఏ షాక్ : పతంజలి”కరొనిల్​”తో కేంద్ర ఆరోగ్య మంత్రికి చిక్కులు

కరోనా ఎదుర్కొనేందుకు పతంజలి సంస్థ విడుదల చేసిన కరొనిల్​ టాబ్లెట్ ​పై ఇండియన్​ మెడికల్​ అసోసియేషన్(ఐఎంఏ)​ విస్మయం వ్యక్తం చేసింది. తాము అభివృద్ధి చేసిన కరొనిల్ ఔషధాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) ధ్రువీకరించిందని పతంజలి సంస్థ చెప్పడాన్ని తప్పుబట్టింది.

దీనిపై వివరణ ఇవ్వాలని ఈ ఔషధ ఆవిష్కార కార్యక్రమానికి హాజరైన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ను కోరింది. ఆరోగ్య శాఖ మంత్రి హోదాలో ఉండి ఒక తప్పుడు, అశాస్త్రీయమైన వస్తువును ఎలా ప్రజల కోసం విడుదల చేస్తారు? కరోనాను ఎదుర్కొనే ఔషధం అని చెప్పేందుకు దీనిపై జరిగిన క్లినికల్​ ట్రయల్స్​ గురించి వివరిస్తారా? మంత్రి నుంచి దేశ ప్రజలకు వివరణ కావాలి. దీనిని సుమోటోగా తీసుకోవాలని జాతీయ వైద్య మండలికి మేము లేఖ రాశాం. కరొనిల్​ను డబ్ల్యూహెచ్​ఓ ధ్రువీకరించిందన్న విషయాన్ని తెలుసుకుని మేం ఆశ్చర్యానికి గురయ్యాం అని ఇండియన్​ మెడికల్​ అసోసియేషన్ తెలిపింది.

కాగా, ఫిబ్రవరి 19న ఈ కరొనిల్​ టాబ్లెట్ ​ను బాబా రామ్​ దేవ్​ ఆవిష్కరించారు. తమ సంస్థ విడుదల చేస్తున్న ఈ ఔషధానికి డబ్ల్యూహెచ్​ఏ ధ్రువీకరణ స్కీమ్​లో భాగంగా కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థకు చెందిన ఆయుష్​ విభాగం ఆమోదించిందని చెప్పారు. అయితే కొవిడ్​కు సంబంధించి ఎలాంటి సంప్రదాయ ఔషధాలను తాము అనుమతి ఇవ్వలేదని ట్విట్టర్​ వేదికగా డబ్ల్యూహెచ్​ఓ స్పష్టం చేసింది.

మరోవైపు, కరొనిల్​ ఔషధం విషయంలో నెలకొన్న ఈ అనిశ్చితిపై పతంజలి ఎండీ బాలకృష్ణ ట్విట్టర్​ వేదికగా వివరణ ఇచ్చారు. డబ్ల్యూహెచ్​ఓ ఎలాంటి ఔషధాలకు అనుమతి ఇవ్వదని తెలిపారు. ప్రజలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించేందుకు డబ్ల్యూహెచ్​ఓ కృషి చేస్తుందని తెలిపారు.