భారత్ యుద్ధానికి వస్తే మేమూ సిద్ధమే : పాక్ కౌంటర్

  • Published By: veegamteam ,Published On : February 19, 2019 / 09:28 AM IST
భారత్ యుద్ధానికి వస్తే మేమూ సిద్ధమే : పాక్ కౌంటర్

పుల్వామా ఉగ్రదాడిపై మొదటిసారి నోరు విప్పింది పాకిస్తాన్. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. భారతదేశం వైఖరిని ఖండించారు. యుద్ధానికి వస్తే మేమూ సిద్ధమే అంటూనే.. శాంతి వచనాలు చేశారు. భారత్‌ వైపు నుంచి తమపై దాడి జరిగితే తిప్పికొడతామంటూ స్పష్టం చేశారు. యుద్ధం చేయడం చాలా ఈజీనేనని, అయితే తదనంతర పరిణామాలను కూడా రెండు దేశాలు ఆలోచించుకోవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు. పుల్వామా ఉగ్రదాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. ఆధారాలు లేకుండా తమపై ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. ఆధారాలు ఉంటే చూపించాలంటూ సవాల్ విసిరారు ఇమ్రాన్. ఖాన్.
    

దాడి ఘటనకు సంబంధించి తమ ప్రమేయం ఉందని ఆధారాలు చూపితే… దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారాయన. తామూ ఉగ్రవాద బాధితులమేనని, ఉగ్రకార్యకలాపాలతో ఇబ్బందుల ఎదుర్కొంటున్నామని చెప్పుకొచ్చారు. పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి భారత్ కు పూర్తిగా సహకరిస్తామని చెప్పారాయన. పాక్ ఎప్పటికీ ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వదని.. కిరాతకులను ప్రోత్సహించదని వెల్లడించారు ఖాన్. 15 సంవత్సరాల్లో పాకిస్తాన్ లో 75వేల మంది ఉగ్రదాడులకు బలయ్యారని లెక్కలు చెప్పుకొచ్చారు. ఉగ్రవాదులతో పాకిస్తాన్ స్థిరత్వాన్ని కోల్పోతుందని బాధ వ్యక్తం చేస్తూనే.. పుల్వామా దాడిలో ప్రమేయం లేదని చెప్పుకొచ్చారు.

 

పుల్వామా ఉగ్రదాడి ఘటనపై భారత మీడియా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి ఆధారం లేకుండా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని, భారత్ లో ఇప్పుడు ఎన్నికలు సీజన్ కావడం వల్లే.. మోడీ ప్రభుత్వం అత్యుత్సాహం చూపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇమ్రాన్ ఖాన్.