ఫడ్నవీస్ మెట్రో ప్రయాణంపై మహా పార్టీల విమర్శలు

ఫడ్నవీస్ మెట్రో ప్రయాణంపై మహా పార్టీల విమర్శలు

Devendra Fadnavis మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ ఢిల్లీ మెట్రోలో తాను చేసిన ప్రయాణం గురించి చేసిన వ్యాఖ్యలు మాటల యుద్ధానికి తెరలేపాయి. బుధవారం ఫడ్నవీస్..తాను ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేస్తూ..అధికార మహా వికాస్‌ అఘడి (MVA) సర్కార్‌ను ఇరుకునపెట్టే వ్యాఖ్యలు చేశారు.

ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునేందుకు తాను ఢిల్లీ మెట్రోలో ప్రయాణించానని, రోడ్డు మార్గంతో పోలిస్తే తక్కువ సమయంలో గమ్యస్ధానానికి చేరుకున్నానని ఫడ్నవీస్‌ ట్వీట్‌ చేశారు. ముంబైలో మెట్రో ౩ ద్వారా ఎయిర్‌పోర్ట్‌కు తాను ఎప్పుడు ప్రయాణిస్తానో తెలియదని, ఎంవీఏ సర్కార్‌ నిర్వాకంతో పనులన్నీ ఆగిపోయాయని ఫడ్నవీస్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

ఫడ్నవీస్‌ వ్యాఖ్యలపై శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు విరుచుకుపడ్డాయి. ఇతరులపై ప్రశంసలు గుప్పించే ముందు మహారాష్ట్రను చూసి గర్వపడాలని ముఖ్యమంత్రి ఉద్థవ్‌ ఠాక్రే మీడియా సలహాదారు హర్షల్‌ ప్రధాన్‌ ఫడ్నవీస్‌కు హితవు పలికారు. ముంబై మెట్రో ప్రాజెక్టుకు కేంద్రంలో బీజేపీ సృష్టించే అడ్డకులను అధిగమించేందుకు ఫడ్నవీస్‌ చొరవ చూపాలని ఎన్సీపీ ప్రతినిధి మహేష్‌ తపసి అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో అభివృద్ధి చేసిన ఢిల్లీ మెట్రోను ఫడ్నవీస్‌ మెచ్చుకోవడం సంతోషకరమని మహారాష్ట్ర కాంగ్రెస్‌ ప్రతినిధి సచిన్‌ సావంత్‌ పేర్కొన్నారు. ముంబైలోని మెట్రోను కూడా గతంలో కాంగ్రెస్‌-ఎన్సీపీ ప్రభుత్వం పూర్తిచేసిందని గుర్తుచేశారు.