161 అడుగుల ఎత్తులో అత్యంత అద్భుతం, అపురూపం.. భూకంపాలు వచ్చినా ఏమీ కాదు.. అయోధ్య రామమందిరం ఫోటోలు

  • Published By: naveen ,Published On : August 5, 2020 / 08:33 AM IST
161 అడుగుల ఎత్తులో అత్యంత అద్భుతం, అపురూపం.. భూకంపాలు వచ్చినా ఏమీ కాదు.. అయోధ్య రామమందిరం ఫోటోలు

కోట్లాది మంది హిందువుల చిరకాల స్వప్నం సాకారం కాబోతోంది. నేడు అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. చారిత్రక అయోధ్య నగరంలో రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ పడనుంది. బుధవారం(ఆగస్టు 5,2020) భూమి పూజ కోసం అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధాని మోడీ ఈ మధ్యాహ్నం రామ మందిర నిర్మాణానికి పునాది రాయి వేయనున్నారు. అతిరథ మహారథుల ముందు భూమి పూజ జరగనుంది. రామాలయ నిర్మాణం కోసం కొన్ని దశాబ్దాల పాటు కోర్టుల్లో మహా సంగ్రామమే నడిచింది. చివరికి మార్గం సుగమైంది. ఈ రోజు చరిత్రలో నిలిచిపోనుంది.

bsecved

3 అంతస్తుల రాతి కట్టడం.. 161 అడుగుల ఎత్తు:
కాగా, రామాలయ నిర్మాణానికి సంబంధించిన నమూనా చిత్రాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ట్విటర్‌ లో విడుదల చేసింది. 3 అంతస్తుల రాతి కట్టడంలో గోపురాలు, స్తంభాలతో 161 అడుగుల ఎత్తులో అత్యంత అద్భుతంగా, అపురూపంగా మందిరాన్ని నిర్మించనున్నారు. గతంలో ప్లాన్ చేసిన దాని కన్నా ఇప్పుడు డబుల్ ఎత్తులో మందిరాన్ని నిర్మించనున్నారు.

Image

భారతీయ సాంస్కృతిక వైభవానికి అద్దం పట్టేలా, మూడేళ్లలో నిర్మాణం పూర్తి:
భారతీయ సాంస్కృతిక వైభవం, నిర్మాణ శైలికి ప్రతీకగా రామ మందిరం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. భారతీయ అధ్యాత్మిక వైభవాన్ని అభివ్యక్తీకరించేలా మందిర నిర్మాణం చేపట్టనున్నట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ట్విటర్‌‌లో తెలిపింది. సుమారు 3 నుంచి మూడున్నరేళ్లలో మందిర నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు.

Image

5 గుమ్మటాలు, అష్టభుజి ఆకృతిలో గర్భగుడి:
నమూనా ఆకృతుల ప్రకారం మొత్తం 5 గుమ్మటాలు ఉంటాయి. గర్భగుడి అష్టభుజి ఆకృతిలో ఉంటుంది. ప్రముఖ శిల్పి చంద్రకాంత్‌ సోమ్‌పుర(77) ఈ ఆలయాన్ని డిజైన్‌ చేశారు. ప్రస్తుతం ఆయన దేశంలో నిర్మించ తలపెట్టిన 8 ఆలయాలకు డిజైన్లు రూపొందిస్తున్నారు. శిల్ప శాస్త్రంపై ఆయన 12 పుస్తకాలను రచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. సోమ్‌నాథ్‌, అక్షర్‌థామ్‌ లాంటి అనేక పుణ్యక్షేత్రాల ఆకృతులను సోమ్‌పుర కుటుంబమే రూపొందించడం విశేషం.

Image

రామ మందిర నమూనాల కోసం తనను 30 ఏళ్ల కిందటే సంప్రదించినట్లు చంద్రకాంత్ సోమ్‌పుర తెలిపారు. అప్పట్లోనే డిజైన్ రూపొందించినట్లు వెల్లడించారు. ఆ ఆకృతిలో ప్రస్తుత శైలికి తగినట్లు కొన్ని మార్పులు చేసినట్లు తెలిపారు.

2 ఎకరాల విస్తీర్ణంలో మందిరం నిర్మాణం:
రెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ మందిరాన్ని నిర్మించనున్నారు. ఉత్తర భారతదేశ నాగర శైలిలో ఆలయ నిర్మాణం ఉండనుంది. ముందుగా అనుకున్న నమూనా కంటే ఆలయం ఎత్తు 20 అడుగులు పెంచినట్లు శిల్పులు తెలిపారు. ఆలయ సముదాయంలో ఒకేసారి లక్ష మంది భక్తులు సమావేశం కావచ్చని చెబుతున్నారు. భారతీయులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ మందిర నిర్మాణం భూమి పూజ కోసం దేశంలోని 2వేల ప్రాంతాల నుంచి మట్టిని తీసుకొచ్చారు. 101 నదుల నుంచి నీటిని తీసుకొచ్చారు.

రామాలయం ప్రత్యేకతలు:
* నాగర శైలిలో అయోధ్య రామ మందిరం నిర్మాణం
* ఈ ఆలయ నిర్మాణంలో ఇనుము, సిమెంట్ వాడరు. కేవలం రాతి పలకలతోనే (రాజస్తాన్, ఆగ్రా నుంచి తెప్పిస్తారు) ఆలయ నిర్మాణం
* వెయ్యేళ్లయినా ఆలయ పటిష్టత దెబ్బతినకుండా, రిక్టర్ స్కేల్ పై 10 తీవ్రత ఉండే భూకంపాలు వచ్చినా నిర్మాణం చెక్కు చెదరకుండా డిజైన్ రూపొందించారు
* ఇక ఆలయ ప్రధాన ద్వారం దగ్గర ఎంత దూరంలో నిల్చున్నా, రాముడి విగ్రహం కనిపించేలా నిర్మాణం ఉంటుంది.