Bihar Politics : మోడీకి ప్రత్యామ్నాయంగా నితీష్ నిలవగలరా..? విపక్షాలన్నీ ఒక్క తాటిమీదకు రావడం సాధ్యమేనా ?

బీజేపీ మీద పోరులో విపక్షాలకు నితీష్‌ కుమార్ ఆశాదీపంలా కనిపిస్తున్నారు. నిజంగా నితీష్ ప్రభావం జాతీయ రాజకీయాలపై ఉంటుందా.. మోదీకి ప్రత్యామ్నాయంగా నితీష్ నిలవగలరా.. అసలు విపక్షాలన్నీ ఒక్కతాటి మీదకు వస్తాయా.. అది సాధ్యమేనా ?

Bihar Politics : మోడీకి ప్రత్యామ్నాయంగా నితీష్ నిలవగలరా..? విపక్షాలన్నీ ఒక్క తాటిమీదకు రావడం సాధ్యమేనా ?
ad

Bihar Politics : బీజేపీ మీద పోరులో విపక్షాలకు ఇప్పుడు.. నితీష్‌ కుమార్ ఆశాదీపంలా కనిపిస్తున్నారు. నిజంగా నితీష్ ప్రభావం జాతీయ రాజకీయాలపై ఉంటుందా.. మోదీకి ప్రత్యామ్నాయంగా నితీష్ నిలవగలరా.. మహాఘట్‌ బంధన్‌ ఇకపై ఎలాంటి ప్రయత్నాలు చేయబోతోంది.. అసలు విపక్షాలన్నీ ఒక్కతాటి మీదకు వస్తాయా.. అది సాధ్యమేనా ?

నిజానికి ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు.. నితీష్‌కు మంచి ఇమేజ్ ఉండేది. బిహార్‌ను మార్చేశారని.. అద్భుతమైన పాలకుడు అని.. దేశానికి మంచి నాయకత్వం ఇవ్వగలరని అంతా అనుకున్నారు. ఆ సమయంలో నితీష్ కూడా ప్రధాని స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. 2014కు ముందు తనవంతు ప్రయత్నాలు కూడా చేశారు. అప్పట్లో మోదీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన నితీష్‌.. ఎన్డీయే నుంచి బయటకువచ్చారు. ఐతే మోదీ ప్రధాని అయిన తర్వాత… ఆయన ఇమేజ్ ఒక్కసారిగా పెరిగింది. నితీష్ మాత్రం ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోయారు. పైగా ఆయన పార్టీ కరిగిపోతోంది. దీంతో చివరి ప్రయత్నంగా వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా తెర ముందుకు రావాలని వ్యూహాలు సిద్ధం చేస్తున్నారని.. దానికి అనుగుణంగానే అడుగులు వేస్తున్నారన్న చర్చ నడుస్తోంది.

2014లో గెలిచారు.. 2024లో ఎలా గెలుస్తారన్న నితీష్ మాటలకు అర్థం కూడా.. తాను ప్రధాని రేసులో ఉండబోతున్నాననే సంకేతాలు నితీష్ పంపారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఆయన ఆలోచనలు, ఆశయాలు ఎలా ఉన్నా… అన్ని దారులు మూసుకుపోయిన విపక్షాలకు కొత్త వెలుగులా ఇప్పుడు నితీష్ కనిపిస్తున్నారు. ఐతే బిహార్ పరిణామాలు.. జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపించే అవకాశమే లేదని.. జేడీయూ మాజీ నేత, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌ టాపిక్ అవుతున్నాయ్. బిహార్‌లో పదేళ్లుగా రాజకీయ అస్థిరత కొనసాగుతోందని… బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నితీష్ సంతోషంగా లేరని.. అందుకే బయటకు వచ్చారన్న పీకే వ్యాఖ్యలతో.. నితీష్ ఎపిసోడ్‌ కాస్త లైట్ అవుతున్నట్లు కనిపిస్తోంది.

Also read : Bihar Politics : నితీష్ కుమార్ వ్యవహారంతో విపక్షాల్లో పెరుగుతున్న ఆశలు..ఎన్డీఏకు వ్యతిరేకంగా కూటమికి యత్నాలు

ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. నితీష్‌లో మాత్రం ఇప్పుడు విపక్షాలు కొత్త నాయకున్ని చూస్తున్నాయ్. 2024లో ఎన్డీఏకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను నితీష్ నడిపించగలరన్న చర్చ నడుస్తోంది. నిజానికి ఒక్క రాష్ట్రంలో అధికారంలో లేనంత మాత్రానా.. అదీ అధికార పార్టీతో పొత్తు కోల్పోయినంత మాత్రాన బీజేపీకి ఇప్పటికిప్పుడు ఎలాంటి నష్టం లేదు. ఐతే నితీష్ రూపంలోనే గట్టి సవాల్ ఎదురయ్యే అవకాశాలు ఉంటాయ్. మోదీ, షా ఆలోచనలు ఎలా ఉంటాయోనే నితీష్‌కు తెలుసు.. దీంతో పాటు మంచి పాలకుడిగా పేరు ఉంది. అలాంటి వ్యక్తిని ముందు ఉంచి.. ఆయన నాయకత్వంలో నడవాలని విపక్షాలు అనుకుంటే.. దానికి నో చెప్పడానికి నితీష్‌ దగ్గర బహుశా కారణాలు కూడా ఉండకపోవచ్చు. నితీష్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తే.. విపక్షాలకు అంతో ఇంతో లాభం అయ్యే అవకాశాలు ఉంటాయ్. బలం పెరిగే చాన్స్ ఉంటుంది. ఇదే ఇప్పుడు విపక్ష పార్టీలకు పెద్ద ఆశగా మారింది.

40పార్లమెంట్ స్థానాలు ఉన్న బిహార్‌లాంటి రాష్ట్రం నుంచి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టి.. కష్టపడితే నితీష్‌ ఎపిసోడ్‌ కాస్తోకూస్తో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక మినహా మరెక్కడా బీజేపీ అధికారంలో లేదు. తెలంగాణలో పరిస్థితి ఏంటన్నది పక్కనపెడితే.. మిగతా ఏ రాష్ట్రంలోనూ ఇప్పటికిప్పుడు కమలం పార్టీ అధికారం అనే ఆలోచన కూడా చేసే అవకాశం లేదు. మిగతా రాష్ట్రాల్లోనూ పరిస్థితులు మారుతున్నాయ్. ఇలాంటి సమయంలో విపక్ష పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వస్తే మాత్రం.. అది బీజేపీకి ప్రమాదసంకేతం అవుతుంది. మరి విపక్షాలను ఏకతాటి మీదకు తీసుకురావడమే ఇప్పుడు ప్రధానంగా ఉన్న సవాల్.

ఏకం కావాలన్న ఆశ ఉన్నా.. తీరా సమయం వచ్చేసరికి విపక్షాలన్నీ ఎవరి దారి వారిది అన్నట్లుగా మారుతున్నాయ్. బెంగాల్‌ ఎన్నికల తర్వాత మమత ప్రయత్నాల తర్వాత అదే జరిగింది.. ఆ మధ్య కేసీఆర్ విషయంలోనూ అదే జరిగింది. మరి ఇప్పుడు నితీష్ వ్యవహారంలో ఏం జరగబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. చాలారోజుల తర్వాత బీజేపీకి షాక్ తగిలిందన్న సంతోషమే విపక్షాల్లో కనిపిస్తుందా.. ఈ సంతోషం ప్రత్యర్థి పార్టీ మీద సమరం వరకు తీసుకెళ్తుందా.. లేదంటే ఎప్పటిలానే ఎవరి దారి వారు అనుకుంటారా అన్న చర్చ నడుస్తోంది. ఐతే నితీష్‌ ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తే.. విపక్షాలన్నీ ఒక్క తాటి మీదకు వచ్చి.. ఎన్డీఏకు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.