ఏది నిజం : తుఫాన్ తీరం దాటే సమయంపై గందరగోళం

  • Published By: veegamteam ,Published On : May 2, 2019 / 10:15 AM IST
ఏది నిజం : తుఫాన్ తీరం దాటే సమయంపై గందరగోళం

ఫొని తుఫాన్ తీరం దాటే ప్రాంతంపై క్లారిటీగా ఉన్న అందరూ.. సమయంపై మాత్రం గందరగోళానికి గురవుతున్నారు. 2019, మే 3వ తేదీ ఒడిశా రాష్ట్రం పూరీ – చిలికా మధ్య తీరం దాటనుంది. ఇది అయితే అందరూ ఓకే అంటున్నారు. అయితే తీరం దాటే సమయం విషయంలో మాత్రం ఇన్ కాయిస్ – ఇతర వాతావరణ రిపోర్టులు వేర్వేరుగా వెల్లడించటంతో గందరగోళానికి గురవుతున్నారు ప్రజలు. ఇన్ కాయిస్ ( ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్) మాత్రం మే 3వ తేదీ శుక్రవారం ఉదయం 5-6 గంటల మధ్య తీరం దాటనున్నట్లు తన నివేదికలో స్పష్టం చేసింది.

ఇక జాయింట్ టైఫూన్ వార్నింగ్ సెంటర్(JTWC) సెంటర్ మాత్రం ఉదయం 8 గంటలకు తీరం దాటుతుందని వెల్లడించింది. ఇక స్కైమెట్ (Skymet) మాత్రం మాత్రం 11:30 గంటల సమయంలో తీరం దాటనున్నట్లు ప్రకటిస్తున్నాయి. తీరం దాటే సమయంలో గందరగోళంపై రెస్క్యూ టీమ్స్ అయోమయానికి గురవుతున్నాయి. తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత 200 కిలోమీటర్లుగా ఉండొచ్చని చెబుతున్నారు. ఇదే జరిగితే మాత్రం భారీ విధ్వంసం ఖాయం. చెట్లు, కరెంట్ స్తంభాలు, సెల్ టవర్లు అన్ని కూలిపోవటం పక్కా అంటున్నారు.

తీరం దాటే సమయంతో సంబంధం లేకుండా.. మే 2వ తేదీ సాయంత్రానికి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించటం పూర్తి చేస్తాం అని ప్రకటించింది ఒడిశా ప్రభుత్వం. సహాయ సిబ్బంది కూడా అన్నింటికీ సిద్ధంగా ఉన్నారని.. అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. రెండు, మూడు రోజులకు సరిపడా ఆహారం, మంచినీళ్లు, కొవ్వొత్తులు, ఇతర సామాగ్రి మొత్తాన్ని ఇప్పటికే సిద్ధం చేశామని.. ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని వెల్లడించింది ఒడిశా ప్రభుత్వం.