Corona New Variant : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై భారత్ అప్రమత్తం..కాసేపట్లో ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష

ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తుండడంతో....భారత్ అప్రమత్తమయింది. ప్రధానమంత్రి మోదీ కాసేపట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

10TV Telugu News

India alerts on Omicron of new variant : ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తుండడంతో….భారత్ అప్రమత్తమయింది. ప్రధానమంత్రి మోదీ కాసేపట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కొత్త వేరియంట్, కరోనా వ్యాక్సినేషన్‌పై ప్రధాని సమీక్షించనున్నారు. వ్యాక్సినేషన్‌పై ప్రధాని కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని భావిస్తున్నారు. చిన్నారులకు టీకా అంశంపై చర్చలు జరపునున్నారు. కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్, నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ సమావేశానికి హాజరవుతున్నారు.

మరోవైపు తెలంగాణలోనూ హై అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ విమానశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. బొట్సువానా, దక్షిణాఫ్రికా, ఇజ్రాయిల్, బెల్జియం, హాంకాంగ్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో పాజిటివ్‌గా తేలినవారి శాంపిళ్లను సీసీఎంబీకి పంపిస్తున్నారు. న్యూ వేరియంట్‌పై అప్రమత్తంగా ఉన్నామన్నారు డీహెచ్.

Corona New Variant : ప్రపంచదేశాల్లో మళ్లీ కరోనా టెన్షన్..దక్షిణాఫ్రికాలో వేగంగా వ్యాపిస్తున్న కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’

కరోనా డేంజర్ బెల్స్ మళ్లీ మొదలయ్యాయి. తగ్గిందనుకున్నప్పుడల్లా….కొత్త వేరియంట్లతో విరుచుకుపడడం కరోనా నైజంలా ఉంది. ఒమిక్రాన్ రూపంలో గతంలో కన్నా మరింత బీభత్సం సృష్టించేందుకు వైరస్ కాచుక్కూచుంది. దక్షిణాఫ్రికాలో మొదలై బొట్సువానా, హాంకాంగ్, బెల్జియం, ఇజ్రాయిల్, డెన్మార్క్‌కు వ్యాపించిన వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఊహించనంత వేగంగా వ్యాపిస్తుండడంతో….వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందనేదానిపై శాస్త్రవేత్తలు ఇంకా నిర్ధారణకు రాలేకపోతున్నారు.

వేరియంట్‌పై పరిశోధనల్లో వచ్చే రెండు, మూడు వారాలు అత్యంత కీలకం కానున్నాయి. దక్షిణాఫ్రికాలో వేరియంట్ వెలుగుచూడగానే ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. బ్రిటన్, ఇతర యూరప్ దేశాలు, అమెరికా….దక్షాణిఫ్రికాతో పాటు ఇతర ఆఫ్రికా దేశాల నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించాయి. ఇది అన్యాయమైన చర్యని దక్షిణాఫ్రికా, భయాందోళన చెందవద్దని WHO అంటున్నా ..గతంలో కరోనా కల్లోలాన్ని అనుభవించిన దేశాలు ముందు జాగ్రత్త పాటిస్తున్నాయి.

Omicron: “ఒమిక్రాన్”.. డెల్టాను మించిన డేంజర్ వేరియంట్‌కు పేరు పెట్టిన WHO

దక్షిణాఫ్రికాలో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. వేరియంట్‌ను గుర్తించిన రెండు, మూడు రోజులలోపే కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. గత వారం కరోనా కొత్త కేసులు 650గా ఉంటే…నవంబర్ 25న ఆ సంఖ్య 2వేల 500కి చేరింది. అంటే కేసుల పెరుగుదల 320శాతంగా ఉంది. ఇవన్నీ కొత్త వేరియంట్ కేసులు కాకపోయినప్పటికీ..ఎక్కువశాతం అవే ఉండొచ్చని భావిస్తున్నారు. అనధికారికంగా కొత్త వేరియంట్ కేసుల సంఖ్య దక్షిణాఫ్రికాలో వెయ్యికి చేరువలో ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ దేశంలోని అన్ని ప్రావిన్స్‌లలో వేరియంట్ వ్యాపించిందని అనుమానిస్తున్నారు.

రోగనిరోధక వ్యవస్థ పనిచేయని, చికిత్స పొందని హెచ్‌ఐవీ, ఎయిడ్స్ రోగి నుంచి వేరియంట్ వ్యాపించిందని గుర్తించడం, వ్యాక్సిన్లకు, యాంటీబాడీలకు లొంగదన్న ప్రచారం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయకంపితులను చేస్తోంది. వ్యాక్సిన్ల ద్వారా శరీరంలో ఉండే యాంటీబాడీలు, గతంలో కరోనా సోకినవారికి ఉండే యాంటీబాడీలు అన్నింటినీ కొత్త వేరియంట్ లొంగదీసుకుంటోంది. సరిగ్గా చెప్పాలంటే…వ్యాక్సిన్ వేయించుకున్నాములే..గతంలో మనకు సోకిందిలే…అన్న ధీమా ఏమాత్రం ఉండకూడదు. ఎవ్వరిమీదైనా ఒమిక్రాన్ దాడి చేయవచ్చు. అంతే కాదు…ఒకసారి ఈ వేరియంట్ సోకిన వారికి మళ్లీ మళ్లీ సోకే ప్రమాదం కూడా పొంచి ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు.

×