India-China Military Talks : సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత..భారత్-చైనా అంగీకారం

సరిహద్దుల్లో సైనిక ప్రతిష్టంభనపై శనివారం భారత్-చైనా సైన్యాలు నిర్వహించిన 12వ విడత చర్చలపై సోమవారం(ఆగస్టు-2,2021) సంయుక్త ప్రకటన విడుదలైంది.

India-China Military Talks సరిహద్దుల్లో సైనిక ప్రతిష్టంభనపై శనివారం భారత్-చైనా సైన్యాలు నిర్వహించిన 12వ విడత చర్చలపై సోమవారం(ఆగస్టు-2,2021) సంయుక్త ప్రకటన విడుదలైంది. తూర్పు లడఖ్ సరిహద్దు వివాదంపై జరిగిన 12వ రౌండ్ చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయని భారత్-చైనా దేశాల ఆర్మీలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. తూర్పు లడఖ్​లో తలెత్తిన సమస్యను వేగవంతమైన పద్ధతిలో పరిష్కరించుకునేందుకు భారత్, చైనా సైన్యాలు అంగీకారానికి వచ్చినట్లు ప్రకటనలో తెలిపారు.

వాస్తవాధీన రేఖ వెంబడి ప్రతిష్టంభనపై ఇరుపక్షాలు దాపరికం లేకుండా లోతైన చర్చలు జరిపినట్లు భారత ఆర్మీ తెలిపింది. ఈ సమావేశం పరస్పర అవగాహన పెంపొందించేందుకు దోహదం చేశాయని పేర్కొంది. ఇప్పటికే కుదిరిన ఒప్పందాల ప్రకారం మిగిలిన అంశాలను వేగవంతమైన పద్ధతిలో పరిష్కరించుకునేందుకు అంగీకరించుకున్నట్లు తెలిపారు. చర్చలు, సంప్రదింపులు కొనసాగించాలని నిశ్చయించుకున్నట్లు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఎల్ఏసీ వెంట సుస్థిరత కోసం చర్యలు కొనసాగించాలని ఇరుపక్షాలు అంగీకారానికి వచ్చినట్లు సంయుక్త ప్రకటన పేర్కొంది. శాంతి, ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించాలని అంగీకరించినట్లు తెలిపింది.

కాగా, 15 నెలలుగా సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో శనివారం భారత్, చైనాల మధ్య 12వ రౌండ్ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. వాస్తవాధీన రేఖ(LAC) వెంబడి చైనా భూభాగంలోని మోల్డోలో దాదాపు 9 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈశాన్య లడఖ్ ప్రాంతం(హాట్ స్ప్రింగ్, గోగ్రా పోస్టు ఏరియాలు కూడా)లో పూర్తిగా బలగాల ఉపసంహరణపై భారత్, చైనా అధికారులు కీలకంగా చర్చించారు. జులై-14,2021న తజకిస్తాన్ లో దుషాన్బే సిటీలో చైనా విదేశాంగ మంత్రితో భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ చర్చలు జరిపిన రెండు వారాల తర్వాత 12 రౌండ్ మిలిటరీ చర్చలు జరగడం గమనార్హం. కాగా, చివరిసారిగా ఏప్రిల్- 9,2021న ఎల్ఏసీ వెంట భారత భూభాగంలోని చుహుల్ బోర్డర్ పాయింట్ వద్ద 11 రౌండ్ చర్చలు జరిగాయి. ఈ చర్చలు 13 గంటలపాటు కొనసాగాయి.

ట్రెండింగ్ వార్తలు