చైనా ఎంబసీలోకి గొర్రెలు తోలిన వాజపేయి.. డ్రాగన్ కి అప్పట్లో భలే బుద్ధి చెప్పాడు

  • Published By: venkaiahnaidu ,Published On : June 26, 2020 / 12:49 PM IST
చైనా ఎంబసీలోకి గొర్రెలు తోలిన వాజపేయి.. డ్రాగన్ కి  అప్పట్లో  భలే బుద్ధి  చెప్పాడు

ఇరుగుపొరుగుతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం చైనాకు షరామామూలే.  ప్రతి చిన్న విషయానికి, చీటికి మాటికి గిల్లికజ్జాలు పెట్టుకుని యుద్ధకాంక్షతో రగిలిపోయే చైనాకు దివంగత మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజపేయి ఓసారి సమయస్ఫూర్తితో పెద్ద గుణపాఠమే చెప్పారు. అది 1965. భారత్-చైనా  యుద్ధం తర్వాత పరిస్థితులు ఇంకా గంభీరంగానే ఉన్నాయి. డ్రాగన్ పదే పదే ఇండియాపై అక్కసు వెళ్లగక్కతూనే ఉంది. 

సిక్కిం సరిహద్దు దాటి తమ దేశానికి చెందిన వ్యక్తుల నుంచి 800 గొర్రెలు, 59 జడల బర్రెలను భారత సైన్యం దొంగిలించిందని చైనా  ఆరోపించింది. ఇది సాకుగా చూపి మళ్లీ సైనిక చర్యకు దిగాలనేది డ్రాగన్ ఆలోచన. చైనా ఆరోపణను భారత్ కొట్టిపారేసింది. ఇరువర్గాల మధ్య కొన్నాళ్ల పాటు ఈ సమస్యపై లేఖల యుద్ధం జరిగింది. 

ఆ సమయంలో జనసంఘ్‌ నుంచి యువ పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న అటల్‌ బిహారి వాజపేయికి చైనా తీరుతో చిర్రెత్తుకొచ్చింది. దీంతో ఆయన అప్పటికప్పుడు వినూత్నరీతిలో చైనాకు బుద్ధి చెప్పారు. దాదాపు ఎనిమిది వందల గొర్రెలను ఢిల్లీలోని చైనా ఎంబసీకి తోలుకెళ్లారు. వాటి మెడలో ‘మమ్మల్ని తినండి. కానీ, ప్రపంచాన్ని కాపాడండి’ అనే ప్లకార్డులు వేశారు. గొర్రెలు, బర్రెల పేరుతో ప్రపంచయుద్ధానికి చైనా తెరలేపుతోందని విమర్శించారు. 

వాజ్​పేయి గొర్రెల నిరసనకు చైనా విస్తుపోయింది. తమ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయానికి ఘాటైన లేఖను పంపింది. గొర్రెల ఘటన వెనుక భారత ప్రభుత్వం ఉందని ఆరోపించింది. ఇందుకు తిరిగి లేఖ రాసిన భారత్.. అందులో నిర్మలమైన పదజాలాన్ని వాడుతూ ‘ఢిల్లీ వాసులు కొందరు 800 గొర్రెలను చైనా ఎంబసీలోకి తోలారు. ఇది ఊహించని విధంగా జరిగిన పరిణామం. నిరసన కూడా ప్రశాంతంగా జరిగింది’ అంటూ జవాబిచ్చింది.

ఈ చర్య చైనాను ఎంతగానో రెచ్చగొట్టింది. ప్రతిపక్షంలో ఉన్న వాజపేయి చేసిన నిరసనను చైనా అవమానంగా భావిస్తుందని పేర్కొంది. లాల్‌ బహదూర్‌శాస్త్రి ప్రభుత్వ మద్దతుతోనే ఇది జరిగిందని ఆరోపిస్తూ భారత్‌కు మరో లేఖ రాసింది. దీనిపై శాస్త్రి ప్రభుత్వం స్పందిస్తూ ఈ ప్రదర్శనతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. ఇది ఆకస్మిక, శాంతియుత, మంచి హాస్య వ్యక్తీకరణతో జరిగిన చర్యగా పేర్కొన్నారు. చైనా బెదిరింపు వ్యూహాన్ని వాజపేయి అపహాస్యం చేసిన మొత్తం ఎపిసోడ్‌ ఉద్రిక్తతలు నెలకొన్న ఆ సమయంలో ప్రజల్లో చర్చకు దారితీశాయి. గొర్రెలు, బర్రెల పేరుతో ప్రపంచ యుద్ధానికి చైనా తెరలేపుతోందని నిరసనకారులు విమర్శించారు