చుషుల్: చైనా, ఇండియాల మధ్య యుద్ధమంటూ వస్తే…ఇక్కడే

  • Published By: murthy ,Published On : September 9, 2020 / 06:16 PM IST
చుషుల్: చైనా, ఇండియాల మధ్య యుద్ధమంటూ వస్తే…ఇక్కడే

India-China border Chushul: ఈ సెక్టార్ చుట్టూ చైనా, భారత్ యుద్ధతంత్రం నడుస్తోంది. సరిహద్దుల్లో చుషుల్ సెక్టార్‌కు ఉన్న ప్రాధాన్యం కారణంగానే 1962 యుద్ధం‌లో కూడా చైనా గురిపెట్టింది . జవాన్ల ప్రాణ త్యాగంతో చుషుల్ ను ఇండియా కాపాడుకోగలిగింది . ఇప్పుడు అదే చైనా చుషుల్ లో ఘర్షణలకు దిగుతోంది .



ఈ ప్రాంతాన్ని ఆక్రమించి సరిహద్దుల్లో భారత దళాలను వ్యూహాత్మకంగా దెబ్బ తీయాలన్నది చైనా వ్యూహం. అందుకే భారత భద్రతా దళాల ఫోకస్ మొత్తం చుషుల్ పైనే. చైనా దళాలు మన కదలికలపై గట్టి నిఘా పెట్టాయి.

1962 యుద్ధం‌లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దృష్టి ఈ ప్రాంతంపై పడింది. ఆ ఏడాది అక్టోబరులో  గాల్వాన్ లోయపై దాడులు చేసింది . ఆ తరువాత లేహ్ ను ఆక్రమించే ఉద్దేశంతో చుషుల్ ఎయిర్ ఫీల్డ్ , చుషుల్ లోయపై దాడులకు ప్రయత్నించాయి .


నవంబరులో భారత్ 114 బ్రిగేడ్ ను అక్కడికి పంపించింది . సాయుధ వాహనాలు , శతఘ్నులతో రెండు ట్రూప్స్  చుషుల్ చేరాయి . గురుంగ్ హిల్ , రేజాన్గ్ లా చైనా స్వాధీనమయ్యాయి . ఆ వెంటనే 114 బ్రిగేడ్ వెనక్కి తగ్గి పర్వతాలపై మాటు వేసింది . చైనా దళాలు వస్తే ముట్టడించడం 114 బ్రిగేడ్ లక్ష్యం.

ఈలోగానే కాల్పుల విరమణ ప్రకటించారు . 140 మంది జవాన్లను కోల్పోయి 114 బ్రిగేడ్ తనకు అప్పగించిన కార్యాన్ని విజయవంతంగా నెరవేర్చింది . రేజాన్గ్ లా వద్ద జరిగిన యుద్ధాన్ని ఇప్పటికీ భారత సైనిక దళాలు గుర్తు చేసుకుంటాయి .



ఆనాడు రేజాన్గ్ లా వద్ద జరిగిన పోరులో 13 కుమోన్ కు చెందిన చార్లీ కంపెనీ 120 మంది జవాన్లలో 114 మంది అమరులయ్యారు . కంపెనీ కమాండర్ మేజర్ షైతాన్ సింగ్ కు మరణానంతరం పరం వీర్ చక్ర బహుకరించారు . ఆనాటి యుద్ధం‌లో చైనా ఆక్రమించిన ప్రాంతాలనే గతనెల చివర్లో భారత భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి .

ఆనాడు చైనా ఆక్రమించిన లుకున్గ్ , స్పంగ్గుర్ గ్యాప్ , గురుంగ్ హిల్ , రేజాన్గ్ లా , మగ్గేర్ హిల్ , తటంగ్ హైట్స్ ప్రాంతలు ఇప్పుడు భారత సైనిక దళాల స్వాధీనం లో ఉన్నాయి .

భవిష్యత్తులో చుషుల్ ప్రాంతం లో భారత్ ఎలాంటి సవాళ్లు ఎదుర్కోబోతోంది ? ప్రస్తుతం బ్లాక్ టాప్ , రేచిన్ లా వద్ద ఇండియా , చైనా దళాలు మోహరించాయి . రెండు దేశాల దళాలకు మధ్య దూరం కిలోమీటరే. రెండు దేశాల మధ్య ఘర్షణ జరిగితే మొదట ఇదే ఆరంభం కావచ్చు. ఇండియాకున్న తక్షణ సవాలు ఇదే . ఇక్కడ కొండలపై మోహరించిన సైనిక దళాలకు మంచి నీళ్లు , తిండి , ఇతర అవసరాలు అందించడం ఇప్పుడు ఇండియా‌కు మరో సవాలు .



ఆ కొండలపైకి రోడ్డు లేదు . సైనికులకు ఆపనులు అప్పగించలేరు . వాళ్లే పనులు సరఫరా చేస్తే, దాడుల సమయంలో త్వరగా అలసిపోతారు . ఇక్కడ పోర్టర్స్ అవసరం ఎక్కువగా ఉంది . చుషుల్ గ్రామస్తులే ఇప్పుడా పనులు చేస్తున్నారు .

చుషుల్ గ్రామంలో 170 కుటుంబాలున్నాయి . వారిలో ఎక్కువ టిబెట్ నుంచి వలస వచ్చిన వారే . వారే కొండలపై మోహరించిన భద్రతా దళాలకు మంచి నీళ్లు , ఆహారం  చేరవేస్తున్నారు . వచ్చేది శీతాకాలం. .ఎనిమిది నెలల పాటు ప్రకృతి నుంచి భారత్ ఎదుర్కొనే అతిపెద్ద సవాల్ ఇది. ఆ పర్వతాలపై తవ్వకాలు చాలా కష్టం . దళాల కోసం గుడారాలు ఏర్పాటు చేయడం మరో  సమస్య . ఉష్ణోగ్రతలు మైనస్ 30 డిగ్రీలకు పడిపోతాయి. మంచు తుఫాన్లు ముంచెత్తుతాయి .


పర్వతాలకు దిగువన ఉన్న పాంగాంగ్ సరస్సు కూడా గడ్డకడుతుంది . సరస్సు ఉత్తర ఒడ్డు , దక్షిణ ఒడ్డు మధ్య రాకపోకలు కూడా సాగుతుంటాయి . ఇది మరో సవాలు కావచ్చు . గడచిన నెల చివర్లో భారత భద్రతా దళాలు ఆక్రమించిన ప్రాంతాలను నిలబెట్టుకోవాలంటే ఈ సవాళ్ళన్నీ ఎదుర్కోక తప్పదు .