సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం : కరాకోరం పాస్ దగ్గర T-90 ట్యాంకులను మోహ‌రించిన భార‌త్‌

  • Published By: venkaiahnaidu ,Published On : July 27, 2020 / 09:31 PM IST
సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం : కరాకోరం పాస్ దగ్గర T-90 ట్యాంకులను మోహ‌రించిన భార‌త్‌

భార‌త్-చైనా స‌రిహ‌ద్దులో ఉద్రిక్త ప‌రిస్థితులు ఇంకా కొన‌సాగుతున్నాయి. భారత్-చైనాల మధ్య వివాదాస్పదంగా ఉన్న అక్సాయ్ చిన్ దగ్గర సుమారు 50 వేల మంది చైనా సైనికులు ఉన్నారు. ఈ నేప‌థ్యంలో భార‌త్ తొలిసారి క్షిప‌ణులు ప్ర‌యోగించ‌గ‌ల‌ T-90 ట్యాంకుల స్క్వార్డ‌న్‌ను స‌రిహ‌ద్దులో మోహ‌రించింది.

షాక్స్గామ్-కరాకోరం పాస్ నుంచి చైనా దురాక్రమణను నివారించడానికి కీల‌క‌మైన దౌలత్ బేగ్ ఓల్డి (డీబీవో) వ‌ద్ద టీ 90 ట్యాంకుల‌తోపాటు సుమారు నాలుగు వేల మంది సైనికుల‌ను రంగంలోకి దించింది.

గత నెలలో, గ‌ల్వాన్ వ్యాలీలో ఇరు దేశాల సైనికుల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ ప్రాంతానికి స‌మీపంలో 16 వేల అడుగుల ఎత్తులో ఉన్న డీబీవో, భార‌త్ స‌రిహ‌ద్దులో ఉన్న చివ‌రి సైనిక అవుట్‌పోస్టు. ఈ ఘ‌ర్ష‌ణ అనంత‌రం ఇరు దేశాలు త‌మ బ‌ల‌గాల‌ను వెన‌క్కి మ‌ళ్లించాల‌ని వ‌రుస‌గా జ‌రుపుతున్న చ‌ర్చ‌ల్లో నిర్ణ‌యించాయి.

మ‌రోవైపు 1963లో పాకిస్థాన్ నుంచి చ‌ట్ట‌విరుద్ధంగా పొందిన షాక్స్గామ్ లోయలోని ప్రాంతంలో చైనా ఇప్ప‌టికే సుమారు 36 కిలోమీటర్ల రహదారిని నిర్మించింది. ఈ నేప‌థ్యంలో జి -219 (లాసా-కష్గర్) రహదారిని కరాకోరం పాస్‌తో చైనా అనుసంధానిస్తుందని భార‌త్ ఆందోళ‌న చెందుతున్న‌ది. దీని కోసం గుహ‌లు త‌వ్వాల్సి ఉండ‌గా చైనాకు ఆ సాంకేతిక ప‌రిజ్ఞానం ఉండ‌ట‌మే దీనికి కార‌ణం.

ఇది పూర్త‌యితే ఉత్త‌ర‌వైపు నుంచి చైనా దురాక్ర‌మ‌ణ‌కు పాల్ప‌డే అవ‌కాశం ఉన్న‌ది. ఈ నిర్మాణం కోస‌మే అక్సాయ్ చిన్ వ‌ద్ద త‌న సైన్యాన్ని, ట్యాంకులు, ర‌డార్ల‌తోపాటు గ‌గ‌న‌త‌ల ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ల‌ను చైనా మోహ‌రించిన‌ట్లు భార‌త్ అనుమానిస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో కార్గిల్‌లో పాక్ మాదిరిగా మ‌రో దురాక్ర‌మ‌ణ‌కు చైనా పాల్ప‌డ‌వ‌చ్చ‌ని భావిస్తున్న భార‌త్, ఆ ప్ర‌య‌త్నాల‌ను తిప్పికొట్టేందుకు ఎత్తైన కీల‌క డీబీవో ప్రాంతంలో టీ 90 ట్యాంకుల‌ను మోహ‌రించిన‌ట్లు తెలుస్తోంది.