Commander Talk : భారత్ – చైనా, అసంపూర్తిగా 13వ విడత చర్చలు

మిలిటరీ కమాండర్ల స్థాయిలో దాదాపు ఎనిమిదిన్నర గంటల పాటు జరిగిన 13వ విడత చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సరిహద్దుల్లోని ఇతర ప్రాంతాలపై ఎలాంటి చర్చ జరగలేదు.

Commander Talk : భారత్ – చైనా, అసంపూర్తిగా 13వ విడత చర్చలు

India

India – China : చైనా దేశాల మధ్య ఎప్పటి నుంచో సరిహద్దు వివాదాలున్నాయి. చైనా పదే పదే ఒప్పందాలను ఉల్లంఘిస్తోంది. అయినా భారత్‌ మాత్రం చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా మిలిటరీ కమాండర్ల స్థాయిలో దాదాపు ఎనిమిదిన్నర గంటల పాటు జరిగిన 13వ విడత చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. చైనా నుంచి ఆమోదయోగ్యం కాని సలహాలతో పాటు ఎలాంటి ప్రతిపాదనలు సిద్ధం చేసుకోలేదని భారత ఆర్మీ చెబుతోంది. భారత్‌ వైపు నుంచి సమస్య పరిష్కారానికి నిర్మాణాత్మక సూచనలు చేసినా.. చైనా నుంచి మాత్రం ఆమోదయోగ్యం కాని వాదనలతో పాటు చర్చలు ముందుకు సాగే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసుకోలేదని అంటోంది.

Read More : Jammu and Kashmir : జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

దీంతో సరిహద్దుల్లోని ఇతర ప్రాంతాలపై ఎలాంటి చర్చ జరగలేదు. రెండు నెలల తర్వాత మరోసారి ఇరు దేశాల కమాండర్లు మాట్లాడుకున్నారు. గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం కొన్ని ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ పూర్తయినా.. డెప్సాంగ్‌, హాట్‌ స్ప్రింగ్స్‌లో మాత్రం బలగాలు ఇంకా ఉన్నాయి. ఉద్రిక్తతలు తగ్గించేందుకు బలగాలను ఉపసంహరించాలని భారత్‌ పదే పదే గుర్తు చేస్తున్నా.. చైనా మాత్రం పట్టించుకోవడం లేదనే అంటోంది. సమాచారం పంచుకోవడంతో పాటు క్షేత్ర స్థాయిలో సుస్థిరత సాధించే దిశగా ముందుకు సాగాలని ఇరు దేశాలు అంగీకరించాయి. చైనా నుంచి తాము కోరుకుంటున్నది అదేనని భారత్‌ అంటోంది.

Read More : India-China: బలగాల ఉపసంహరణపైనే.. భారత్‌, చైనా 13వ రౌండ్‌ చర్చలు

తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్త ప్రాంతాల వద్ద ఇరుపక్షాల బలగాలను త్వరితగతిన ఉపసంహరించుకోవాలని భారత్‌ స్పష్టంగా ప్రస్తావించినా.. చైనా నుంచి మాత్రం సరైన స్పందన లేదంటున్నారు. చుషుల్‌-మొల్డొ సరిహద్దు వద్ద బలగాల ఉపసంహరణ గురించి ప్రధానంగా దృష్టి పెట్టారు. ఎల్‌ఏసీకి అటు ఇటూ.. ఇరుపక్షాలకు చెందిన దాదాపు 50వేల నుంచి 60వేల మంది సైనికులు మోహరించి ఉన్నారు. తాజాగా చైనా బలగాలు రెండు మూడు చోట్ల భారత భూభాగంలోకి చొచ్చుకొనేందుకు ప్రయత్నించగా.. భారత సైనికులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల కమాండర్లు చర్చించేందుకు సిద్ధమయ్యారు. అయితే, చైనా వైపు నుంచి సరైన ప్రతిపాదనలు లేకపోవడంతో పాటు… చర్చల్లో  తీసుకొచ్చిన ప్రతిపాదనలు కూడా ఆమోదించదగినవిగా లేకపోవడంతో ఎలాంటి పురోగతి లేకుండానే చర్చలు ముగిశాయి.