India Corona : ఇండియాపై కరోనా పంజా, మళ్లీ లాక్ డౌన్ తప్పదా ? పలు రాష్ట్రాల్లో ఆంక్షలు

India Corona : ఇండియాపై కరోనా పంజా, మళ్లీ లాక్ డౌన్ తప్పదా ? పలు రాష్ట్రాల్లో ఆంక్షలు

Coronavirus

lockdown 2021 : ఇండియాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది.. చాప కింద నీరులా విస్తరిస్తోంది.. దీంతో మరోసారి దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆంక్షలు మొదలయ్యాయి.. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే.. దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్‌ తప్పదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వ్యాక్సిన్‌ వచ్చేసింది.. ఇక కరోనా దరిచేరదన్న ఆనందం ఆవిరైపోతుంది.. పరిస్థితులన్ని సాధారణానికి వచ్చేశాయనుకుంటున్న సమయంలో.. మళ్లీ కేసులు సంఖ్య పెరుగుతుండటం కలకలం రేపుతోంది..

నిన్న మొన్నటి వరకు దేశవ్యాప్తంగా కేవలం 10 వేల వరకు నమోదయ్యే కేసుల సంఖ్య… ప్రస్తుతం 40 వేల వరకు చేరువవుతున్నాయి. గురువారం దేశ వ్యాప్తంగా 39 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.. గతేడాది నవంబర్‌ 28 తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఐదు రోజులుగా దేశంలో కరోనా వైరస్ కేసుల్లో భారీ పెరుగుదల నమోదవుతోంది. వారం రోజుల్లో సగటు పాజిటివ్ కేసులు 39 శాతం పెరిగింది.

ముఖ్యంగా మహారాష్ట్ర కరోనా కోరల్లో చిక్కి విలవిలలాడుతోంది. మొత్తం కేసుల్లో 63 శాతం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే బయటపడుతున్నాయి. గత ఏడాది నమోదైన రోజువారీ కేసులలో పోల్చిచూస్తే ఇది అత్యధికంగా ఉంది. గత ఏడాది సెప్టెంబర్ 11న మహారాష్ట్రలో అత్యధికంగా 24వేల 886 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు గత ఏడాది కేసుల కంటే పెద్ద సంఖ్యలో కేసులు నమోదు అవ్వడం మహారాష్ట్ర వాసులకు ఆందోళన కలిగిస్తోంది. ముంబై, పూణే, నాగ్‌పూర్, థానే, నాసిక్‌లో భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే ఆంక్షలు అమల్లో ఉండగా.. నాగ్‌పూర్‌లో లాక్‌డౌన్‌ అమలవుతోంది. కరోనా హాట్ స్పాట్ ప్రాంతాల్లో స్కూల్స్‌ను మూసివేశారు.

అటు పంజాబ్‌లోనూ పరిస్థితి దారుణంగా ఉంటోంది. కరోనావైరస్ సెకండ్ వేవ్ కారణంగా రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలలో నైట్ కర్ఫ్యూను పొడిగించారు. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం అమరీందర్ సింగ్ హెచ్చరించారు.

కర్ణాటక, గుజరాత్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, ఢిల్లీలో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం కలకలం రేపుతోంది.

తెలంగాణలో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది.. ముఖ్యంగా స్కూల్‌ విద్యార్థులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అనేక గురుకులాల్లో, ప్రభుత్వ స్కూల్‌ హస్టల్స్‌లోని విద్యార్థులు ఈ వైరస్‌కు టార్గెట్‌గా మారుతున్నారు. దీంతో సర్కార్‌ మళ్లీ ఆంక్షల విధించే విషయంపై ఆలోచనలో ఉంది.. ఇప్పటికే తెలంగాణలో ఆంక్షలు అమలు చేయాలంటూ హైకోర్టు కూడా సీరియస్‌గా చెప్పింది.

ప్రభుత్వాలు- ప్రజల నిర్లక్ష్యం కారణంగానే కేసుల సంఖ్య పెరుగుతోందనేది కేంద్రం వాదన.. ఇప్పటికైనా అలసత్వం వహించకుండా కేంద్ర మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచిస్తోంది.. లేకపోతే పరిస్థితి మళ్లీ చేయిదాటే ప్రమాదం ఉంది.