కరోనా ఉగ్రరూపం.. రెండు లక్షలకు పైగా కేసులు.. ప్రపంచంలో ప్రమాదకరంగా భారత్..

కరోనా ఉగ్రరూపం.. రెండు లక్షలకు పైగా కేసులు.. ప్రపంచంలో ప్రమాదకరంగా భారత్..

India Coronavirus Cases Death Discharged Status Update 17 April 2021

Corona Updates: భారత్‌లోవెన్నులో వణుకు పుట్టిస్తోంది కరోనా మహమ్మారి సెకండ్ వేవ్. అటు పాజిటివ్‌ కేసులు..ఇటు మరణాల్లో సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. దేశంలో వరుసగా మూడో రోజు కూడా 2లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మూడవ రోజు, దేశంలో రెండు లక్షలకుపైగా కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి.

మహమ్మారి ప్రారంభమైన తరువాత మొదటిసారి, సోకిన వారిలో ఎక్కువ మంది ఒక రోజులో మరణించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, గత 24 గంటల్లో 234,692 కొత్త కరోనా కేసులు వెలుగులోకి రాగా.. 1,341 మంది సోకినవారు ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి 1,23,354 మంది కోలుకోగా.. కొత్తగా 217,353 కేసులు వచ్చాయి.

దేశంలో కరోనా..
మొత్తం కరోనా కేసులు – ఒక కోటి 45 లక్షల 26 వేల 609
కోలుకున్నవారు – ఒక కోటి 26 లక్ష 71 వేల 220
క్రియాశీల కేసులు – 16 లక్షలు 79 వేల 740
మరణించినవారు – 1 లక్ష 75 వేల 649

గతేడాది సెప్టెంబర్‌ 15 తర్వాత దేశంలో ఒక్కరోజులో ఇన్ని మరణాలు నమోదవడం ఇదే తొలిసారి కాగా.. 214 రోజుల తర్వాత మళ్లీ అదే రేంజ్‌లో మరణాలు రికార్డయ్యాయి. అటు దేశంలో జూన్ నాటికి ప్రతి రోజు 2 వేల 320 క‌రోనా మ‌ర‌ణాలు న‌మోద‌వుతాయ‌ని లాన్‌సెట్ హెచ్చరించింది. మరికొన్ని రోజుల్లో రోజువారీ సగటు మరణాలు వెయ్యి 720 చేరుతుందని లాన్‌సెట్‌ కమిటీ వార్నింగ్‌ ఇచ్చింది. భార‌త టాస్క్‌ఫోర్స్ స‌భ్యులున్న ఈ క‌మిటీ దేశంలో క‌రోనా రెండో ద‌శ‌పై అధ్యయనం చేసింది. ఫిబ్రవ‌రి నుంచి ఏప్రిల్ వ‌ర‌కు 40 రోజుల్లో దేశ‌వ్యాప్తంగా రోజువారీ క‌రోనా కేసుల సంఖ్య 10 వేల నుంచి 80 వేలకు పెరిగిన‌ట్లు తెలిపింది. గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో ఈ సంఖ్య చేరేందుకు 83 రోజుల సమ‌యం ప‌ట్టింద‌ని వెల్లడించింది.

ప్రపంచంలో నమోదవుతున్న ప్రతి నాలుగు కరోనా కేసుల్లో ఒకటి భారత్‌ నుంచే నమోదవుతోంది. నిన్న ప్రపంచవ్యాప్తంగా 8 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవగా.. అందులో 2లక్షలకు పైగా కేసులు ఇండియాలోనే రికార్డయ్యాయి. అంటే ప్రపంచ కరోనా కేసుల్లో 26శాతం భారత్‌లోనే నమోదయ్యాయి. ఇండియాలో ప్రతి నిమిషానికి 162 పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది.

కరోనా కరాళ నృత్యంతో ఉత్తరప్రదేశ్‌ అల్లాడిపోతోంది. అక్కడ రోజురోజుకు రికార్డవుతున్న కేసులు మహారాష్ట్రను తలపిస్తున్నాయి. ఒక్కరోజులోనే 27 వేల 426 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఎనిమిది రోజుల క్రితం రోజుకు 8 వేల కేసుల మాత్రమే రికార్డయిన ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడు 25 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అంటే వారం రోజుల్లోనే ఉత్తరప్రదేశ్‌లో మూడు రెట్లు కేసులు పెరిగాయి.

అటు ఢిల్లీలో కొన్ని రోజులుగా వైరస్‌ కోరలు చాచుతోంది. దేశంలో అత్యధికంగా కరోనా ప్రభావితమైన నగరాల్లో ఢిల్లీ మొదటిస్థానంలో ఉంది. ఢిల్లీలో ఒక్కరోజే దాదాపు 20 వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ముంబైలో ఇప్పటి వరకు అత్యధికంగా నమోదైన కేసులు 11 వేల 163గా ఉంది. అదేవిధంగా బెంగళూరు వన్‌డే అత్యధిక కేసులు 8 వేల 155గా ఉంది. దేశంలో ఏ నగరంలోనూ ఢిల్లీలో నమోదవుతున్న కేసులు ఇప్పటిదాకా వెలుగు చూడలేదు.

మరోవైపు మ‌హారాష్ట్రలో కరోనా కల్లోలం కంటీన్యూ అవుతోంది. 24 గంట‌ల్లో 63 వేల 729 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వచ్చే 15 రోజుల్లో తమ రాష్ట్రంలో కరోనా యాక్టివ్‌ కేసులు రెట్టింపయ్యే ప్రమాదముందంటూ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ప్రధాని మోదీకి లేఖ రాశారు. రోజుకు ప్రస్తుతమున్న 12 వందల మెట్రిక్‌ టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ వాడకం అప్పటికి 2వేల టన్నులకు చేరుకుంటుందని తెలిపారు. పెరిగిన అవసరాలు తీర్చేలా దేశంలోని మిగతా ప్రాంతాల నుంచి ఆక్సిజన్‌ను విమానాల ద్వారా తరలించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ చట్టాన్ని ప్రయోగించేందుకు అనుమతివ్వాలని కోరారు.