భారత్ లో త్వరలోనే నాజల్ కోవిడ్-19 వ్యాక్సిన్

భారత్ లో త్వరలోనే నాజల్ కోవిడ్-19 వ్యాక్సిన్

nasal vaccine భారత్ లో త్వరలోనే నాజల్ కోవిడ్-19 వ్యాక్సిన్(ముక్కు ద్వారా వేసుకునే వ్యాక్సిన్)అందుబాటులోకి రానుంది. దేశీయ వ్యాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ సంస్థ త్వరలోనే నాజల్ కోవిడ్-19 వ్యాక్సిన్ ని అందుబాటులోకి తీసుకురానుంది. నాగ్‌పూర్‌లోని గిల్లూర్కర్ మల్టీ స్పెషాలిటీలో నాజల్ వ్యాక్సిన్ కు సబంధించిన ఫేజ్-1 మరియు ఫేజ్-2 క్లినికల్ ట్రయల్స్ కు భారత్ బయోటెక్ సిద్దమైంది.

గురువారం భారత్ బయోటెక్ సంస్థ అధినేత డాక్టర్ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ…వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ తో మేము నాసికా లేదా నాజల్ వ్యాక్సిన్ కోసం పని చేస్తున్నాము. ప్రస్తుతం వస్తోన్న రెండు డోసుల వ్యాక్సిన్ ల మాదిరిగా కాకుండా..మేము ఒకే డోస్ వ్యాక్సిన్ పై పనిచేస్తున్నాము. నాజల్ వ్యాక్సిన్ ఉత్తమ ఎంపిక అని పరిశోధనలో తేలింది. కరోనావైరస్ కూడా ముక్కు ద్వారా ఎటాక్ చేస్తుందని చెప్పాడు.

రాబోయే రెండు వారాల్లో… నాజల్ కోవాక్సిన్ కోసం ట్రయల్స్ నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని డాక్టర్ చంద్రశేకర్ గిల్లూర్కర్ అన్నారు. నాసికా మార్గం ద్వారా ఇచ్చే వ్యాక్సిన్లు… ఇంజెక్ట్ చేసిన వాటి కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటాయని తగినంత శాస్త్రీయ ఆధారాలు అందుబాటులో ఉన్నాయన్నారు. భారత్ బయోటెక్ త్వరలో డిసిజిఐకి ప్రతిపాదనను సమర్పించే పనిలో ఉందని తెలిపారు. భువనేశ్వర్, పూణే, నాగ్‌పూర్ మరియు హైదరాబాద్‌లో 18 ఏళ్లు పైబడిన 65 సంవత్సరాల వయస్సు వరకు ఉన్న కనీసం 30-45 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లపై ఈ ట్రయల్స్ నిర్వహించబడతాయి. ప్రస్తుతం అమెరికాలో ట్రయల్స్ లో ఉన్న నాజల్ వేరియంట్ కోవిడ్ -19 వ్యాక్సిన్ విజయవంతమైతే… వైరస్ వ్యాప్తిని ఆపడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు.

నాజల్ వ్యాక్సిన్ అంటే ఏంటీ
కండరాలకు వేసే ఇతర కోవిడ్ -19 వ్యాక్సిన్ల మాదిరిగా కాకుండా.. ఇది ముక్కు ద్వారా పంపిణీ చేయబడుతుంది. ఇది మానవులలో సంక్రమణ యొక్క ప్రారంభ స్థానం కూడా.

సెయింట్ లూయిస్‌లోని యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ చేసిన ఒక అధ్యయనంలో…నాసికా డెలివరీ మార్గం శరీరమంతా బలమైన రోగనిరోధక ప్రతిస్పందనను సృష్టించిందని, అయితే ఇది ముఖ్యంగా ముక్కు మరియు శ్వాసకోశంలో ప్రభావవంతంగా ఉందని, శరీరంలో ఇన్ఫెక్షన్ ను నివారిస్తున్నట్లు తేలింది.