బుద్ధుడి జన్మస్థలంపై వివాదం…నేపాల్ అభ్యంతరం… భారత్ క్లారిటీ

  • Published By: venkaiahnaidu ,Published On : August 10, 2020 / 02:58 PM IST
బుద్ధుడి జన్మస్థలంపై వివాదం…నేపాల్ అభ్యంతరం… భారత్ క్లారిటీ

గౌతమ బుద్ధుడి జన్మస్థలం విషయంలో నెలకొన్న వివాదానికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ పుల్ స్టాప్ పెట్టింది. బుద్ధుడి జన్మస్థలం నేపాల్ లోని లుంబినీయేనని, ఈ విషయంలో తమకు ఎటువంటి సందేహాలు లేవని తేల్చి చెప్పింది.



శనివారం ఓ కార్యక్రమంలో భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ, బుద్ధుడూ, మహాత్మా గాంధీలు అనుసరించిన మార్గం, చేసిన బోధనలు అందరికీ ఆచరణీయమని అన్నారు. ఇదే సమయంలో బుద్ధుడు భారతీయుడని జై శంకర్ వ్యాఖ్యానించినట్టు నేపాల్ మీడియా కథనాలు రాసింది.

నేపాల్ విదేశాంగ శాఖ… జై శంకర్ ప్రసంగాన్ని తప్పుబట్టింది. బుద్ధుడు నేపాల్ లోనే జన్మించారనడానికి ఎన్నో చారిత్రక ఆధారాలు ఉన్నాయని, వాటిని ఎవరూ కాదనలేరని పేర్కొంది. లుంబినీ ప్రాంతం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గానూ ఇప్పటికే గుర్తింపు పొందిందని నేపాల్ విదేశాంగ శాఖ గుర్తు చేసింది. 2014లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, తమ దేశంలో పర్యటించిన వేళ, పార్లమెంట్ లో మాట్లాడుతూ, ఇదే విషయాన్ని ప్రస్తావించారని గుర్తు చేసింది



దీనిపై వివాదం చెలరేగగా, భారత విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. ఇరు దేశాల మధ్యా బౌద్ధమత వారసత్వం ఉందని, గౌతమ బుద్ధుడు నేపాల్ లోనే జన్మించారని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ వ్యాఖ్యానించారు.