దేశంలో కొత్తగా మందిరాలు, మసీదులు అవసరం లేదు

  • Published By: vamsi ,Published On : November 10, 2019 / 02:13 AM IST
దేశంలో కొత్తగా మందిరాలు, మసీదులు అవసరం లేదు

అయోధ్య విషయంలో సంచలన తీర్పు వచ్చిన క్రమంలో చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం రామ జన్మ భూమి విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కొత్తగా ఆలయాలు, మసీదులు, చర్చ్‌లు, గురుద్వారా నిర్మించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. దేశంలో పూజలు, ప్రార్థనలు నిర్వహించేందుకు ఇప్పటికే చాలా మందిరాలు ఉన్నాయంటూ ట్విట్టర్‌లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు.

దేశంలో మందిర్, మసీద్, చర్చి, గురుద్వార్‌లు కొత్తగా కట్టవలసిన అవసరం లేదని, ఇప్పుడు ఉన్నవాటినే మెరుగుపరిచి, వాటి అభివృద్ధికి కృషి చేస్తే చాలునని అభిప్రాయపడ్డారు. అయోధ్య తీర్పు వెలువడిన తర్వాత కార్తీ వ్యాఖ్యలు చేయగా అవి ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

కార్తీ తండ్రి చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో జ్యుడిషీయల్ కస్టడీలో ఉండగా.. ఇదే కేసులో కార్తీ కూడా అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకొచ్చిన సంగతి తెలిసిందే.

అయోధ్యలో వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామ్ న్యాస్‌కు చెందుతుందంటూ సుప్రీం కోర్టు స్పష్టం చేయగా.. సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు మరోచోట ఐదెకరాల భూమి ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. వివిధ రాజకీయ పక్షాలు, మేధావులు అయోధ్య తీర్పును స్వాగతించగా.. కార్తీ చిదంబరం వ్యాఖ్యలు కాస్త విరుద్ధంగా ఉన్నాయి.