చైనా తర్వాత మనమే : ఇండియాలో ఇంటర్నెట్ యూజర్లు 45.1 కోట్లు.. 67శాతం పురుషులే!

  • Published By: sreehari ,Published On : September 28, 2019 / 02:32 PM IST
చైనా తర్వాత మనమే : ఇండియాలో ఇంటర్నెట్ యూజర్లు 45.1 కోట్లు.. 67శాతం పురుషులే!

డిజిటల్ రంగంలో ఇండియా దూసుకెళ్తోంది. ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. టెలికం రంగంలో రిలయన్స్ జియో ఎంట్రీతో నెట్ వినియోగం మరింతగా పెరిగిపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్దాళ్ల వరకు అంతా ఇంటర్నెట్ వాడుతున్నారు. చౌకైన ధరకే స్మార్ట్ ఫోన్లు, జీబీల కొద్ది డేటా తక్కువ ధరకే అఫర్ చేస్తుండటంతో నెట్ యూజర్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. డిజిటల్ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులతో కొద్దికాలంలోనే ఇండియాలో ఇంటర్నెట్ యూజర్ల పరిమితి ఉన్నత స్థాయికి చేరుకుంది. 

టెక్నాలజీ పరంగా అభివృద్ధి సాధించిన చైనా డిజిటల్ రంగంలో అగ్రగామిగా నిలిచింది. ఆ తర్వాత రెండో స్థాయిలో ఇండియా నిలిచినట్టు కొత్త రిపోర్టు వెల్లడించింది. డేటా ఎనాల్టిక్స్ సంస్థ నెల్సన్ హోల్డింగ్స్ భాగస్వామ్యంతో ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IAMAI) ‘ఇండియా ఇంటర్నెట్ 2019’ పేరుతో ఈ రిపోర్టును విడుదల చేసింది. నెలవారీగా ఇండియాలో భారీ సంఖ్యలో 45.1 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నట్టు తెలిపింది. అదే చైనాలో మాత్రం 113.6 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. కారణం.. అక్కడ పట్టణాల నుంచి మారుమూల ప్రాంతాల్లోని గ్రామ జనాభాకు కూడా ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉండటమే. 

67శాతం పురుషులు.. 38శాతం మహిళలు :
రిపోర్టు ప్రకారం.. ఇండియాలో మొత్తం మీద ఇంటర్నెట్ వినియోగం 36 శాతం మాత్రమే అందుబాటులో ఉంది. పట్టణ ప్రాంతాల్లోని యూజర్లు 72శాతం (13.9 కోట్ల జనాభా) ప్రతిరోజు ఇంటర్నెట్ యాక్సస్ చేసుకుంటున్నారు. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 57శాతం (10.9 కోట్లు) యూజర్లకు పడిపోయింది. రీజియన్ల వారీగా యాక్టివ్ యూజర్లు అత్యధికంగా 16ఏళ్ల నుంచి 29ఏళ్ల మధ్య ఉన్నారు. అలాగే నెలవారీ మొత్తం యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లు 6.6 కోట్ల మంది ఉండగా, ఫ్యామిలీ మెంబర్ డివైజ్ లనుంచి ఆన్ లైన్ లోకి వచ్చే వారిలో అత్యధికంగా 5 ఏళ్ల నుంచి 11ఏళ్ల వయస్సులోని యూజర్లు ఉన్నారు. ఇంటర్నెట్ యూజర్లలో ఆడ లేదా మగ ఎంత శాతంగా ఉన్నారంటే.. ఇంటర్నెట్ యూజర్ల జనాభాలో 67 శాతం మంది పురుషులే ఎక్కువగా ఉన్నట్టు రిపోర్టు తెలిపింది. 

ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లోనే ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. అందులో 62 శాతం మంది పురుషులు అయితే 38శాతం మంది మహిళలు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 28శాతం మాత్రమే మహిళా నెటిజన్లు ఉన్నారు. చెన్నై, కోల్ కతా రెండు నగరాల్లో ఆన్ లైన్ లింగ నిష్పత్తి విషయానిక వస్తే.. 44శాతం, 42 శాతం మహిళలు ఉన్నారు. ఇండియాలో అత్యధికంగా ఇంటర్నెట్ యూజర్లు ఉన్న నగరాల్లో ముంబై నుంచి అత్యధికంగా 1.17కోట్ల మంది ఉన్నారు. ఆ తర్వాత రెండో స్థానంలో దేశ రాజధాని ఢిల్లీ 1.12 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. బెంగళూరు, కోల్ కతా నగరాలు వరుసగా 61 లక్షల మంది ఇంటర్నెట్ యూజర్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. చెన్నై నగరం 54లక్షల మంది ఉన్నారు.