ప్రపంచానికి ఆశాకిరణంగా భారత్..రైతుల డిమాండ్లు ఏమిటో అర్థం కావట్లేదు : మోడీ

ప్రపంచానికి ఆశాకిరణంగా భారత్..రైతుల డిమాండ్లు ఏమిటో అర్థం కావట్లేదు : మోడీ

Modi కంటికి కనిపించని శత్రువు “కరోనావైరస్”పై పోరాడి ప్రపంచానికి భారత్ ఆశాకిరణంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం(ఫిబ్రవరి-10,2021) లోక్​సభలో మోడీ మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగం 130 కోట్ల మంది దేశ ప్రజల సంకల్ప శక్తిని చాటిచెప్పిందని ప్రధాని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలోని ప్రతి పదం దేశ ప్రజల విశ్వాసాన్ని పెంచుతుందన్నారు. సంక్షోభ సమయంలోనూ దేశం కొత్త దారులు వెతుక్కొని ప్రగతి పథంలో ఎలా సాగుతుందనే విషయం రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్ఫుటమైందన్నారు. బడ్జెట్‌పై బాగా చర్చ జరిగిందన్నారు. అద్భుతంగా చర్చించిన మహిళా సభ్యులను అభినందించారు.

75 ఏళ్ల స్వతంత్ర భారత్ దిశగా మనం అడుగులు వేస్తున్నామని .. ప్రతి భారతీయుడికి ఇది గర్వకారణమని ప్రధాని అన్నారు. స్వాతంత్ర్యం సాధించి వందేళ్లయ్యే నాటికి దేశాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లాలనే విషయంపై ప్రజలు నూతన సంకల్పం తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మరో పాతికేళ్లలో భారత్ అత్యున్నత స్థాయిలో నిలబడాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయంగా భారత్​కు ప్రాధాన్యం పెరిగిందని చెప్పారు.

భారత్..వైవిధ్యానికి మారుపేరుగా నిలుస్తోందని మోడీ అన్నారు. ఇంత వైవిధ్య దేశంలో ఏ నిర్ణయానికైనా వందశాతం ఆమోదం రాదన్నారు. ఎక్కువమంది ప్రజలకు లబ్ధి కలిగించే నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాలు నడవాలన్నారు. గొప్ప శక్తిగా ఎదిగేందుకు భారత్ కృషి ప్రయస్తోందని..ఆ దిశగా వెళ్లేందుకే ఆత్మ నిర్భర్ భారత్‌ నినాదం ఎత్తుకున్నట్లు చెప్పారు. ఫార్మా రంగంలో భారత్​ ఇప్పటికే ఆత్మ నిర్భర్ సాధించినట్లు వివరించారు. భారత్​ నలుమూలలా స్థానికత నినాదం పెరిగిందని, ఆత్మ నిర్భర భారత్ దిశగా వస్తువులు గ్రామాల్లోనే తయారీ కావాలన్నారు.

కరోనా వేళ కనిపించని శత్రువుతో ప్రపంచం పోరాటం చేసింది చేసిందని, 130 కోట్ల ప్రజల సంకల్ప శక్తితో దేశం కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్లు చెప్పారు. దేవుడి దయ వల్ల కరోనా కష్టాల నుంచి మనదేశం బయటపడిందన్నారు. దేవుడి రూపంలో వైద్యులు, నర్సులు, పారిశుద్ధ కార్మికులు వచ్చారని మోడీ అన్నారు. కరోనా వేళ ప్రపంచ దేశాలకు భారత్​ మార్గసూచిగా నిలిచిందన్నారు. ప్రపంచ ప్రజలంతా బాగుండాలని కోరుకునే దేశం మనదన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శాంతికి ప్రాధాన్యత పెరిగిందని, శాంతి చర్చల మధ్యే కొన్ని దేశాలు సైనికశక్తిని పెంచుకున్నట్లు చెప్పారు ప్రధాని. కొన్ని దేశాలు ఆధునిక యుద్ధ సామగ్రి సిద్ధం చేసుకుంటున్నాయని, కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచ దేశాల ప్రణాళికలు మారినట్లు వెల్లడించారు.

ఇక, వ్యవసాయ చట్టాలను రైతుల సంక్షేమం కోసమే తీసుకొచ్చినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. దేశ ప్రగతికి కొత్త సాగు చట్టాలు అవసరమన్నారు. కాలం చెల్లిన చట్టాలతో దేశం ముందుకెళ్లడం కష్టమన్నారు. చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేస్తోన్న రైతు సంఘాల నేతలతో అనేక సార్లు చర్చలు జరిపామని తెలిపారు. అయితే వారి డిమాండ్లు ఏమిటో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చారు. రైతులకు ఈ చట్టాలు ఇబ్బందిగా ఉంటే వాటిపై తప్పనిసరిగా దృష్టిసారిస్తామని హామీ ఇచ్చారు.

సాగు చట్టాల వల్ల ఏం నష్టం జరిగిందంటూ ఎదురు ప్రశ్నించారు మోడీ. సాగు చట్టాలతో దేశంలో ఎక్కడైనా వ్యవసాయ మార్కెట్లు మూతబడ్డాయా? సాగు చట్టాల వల్ల రైతులకు ఎక్కడైనా మద్దతు ధర దక్కలేదా? కొత్త సాగు చట్టాలతో ఒక్క రైతుకూ నష్టం జరగదు. రైతులకు నష్టం కలిగించే చట్టాలు ఎందుకు చేస్తాం?అని మోడీ అన్నారు. తన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ఓ ఎంపీ ప్రయత్నించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు మోడీ. కావాలనే కొందరు తన ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారని, ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని కొందరు భయపడుతున్నారని అన్నారు. దేశంలో ఎలాంటి మార్పులు రాకూడదని కొందరు కోరుకుంటారన్నారు.