విదేశాల్లో భారతీయులే టాప్, అత్యధికంగా యుఏఈ

10TV Telugu News

India has largest : గత రెండు దశాబ్దాలుగా భారతదేశం నుంచే అత్యధికంగా విదేశాలకు వలస వెళ్తున్నారు. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన అంతర్జాతీయ వలసలు 2020 నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ నివేదిక ప్రకారం ఇతర దేశాలతో పోల్చితే భారతీయులే అత్యధికంగా విదేశాల్లో జీవిస్తున్నారు. దాదాపు 1 కోటి 80 లక్షల మంది భారతీయ పౌరులు వివిద దేశాల్లో జీవిస్తున్నారు. భారత్ తర్వాత స్థానంలో రష్యా, చైనా, సిరియా దేశాలు ఉన్నాయి.

ప్రవాస భారతీయులు అత్యధిక మంది జీవిస్తున్న దేశంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నిలిచింది. యూఏఈలో అత్యధికంగా 35 లక్షల మంది ప్రవాస భారతీయులు జీవిస్తున్నారు. ఆ తర్వాత స్థానంలో అమెరికాలో 27 లక్షలు, సౌదీ అరేబియాలో 25 లక్షల మంది ఉంటున్నారు. ఆస్ట్రేలియా, కెనడా, కువైట్, ఒమన్, పాకిస్తాన్, ఖతర్, బ్రిటన్, ఉత్తర ఐర్లాండ్‌లో కూడా భారీ సంఖ్యలో ప్రవాస భారతీయులు ఉన్నారు. 2020లో కోటి 78 లక్షల 69 వేల 492 మంది ప్రవాస భారతీయులు విదేశాల్లో నివసిస్తుండగా…. భారత్‌లో 48 లక్షల 78 వేల 704 మంది విదేశీయులు నివాసం ఉంటున్నారు. దేశ జనాభాలో వీరి శాతం 0.4 ఉంది. ఇందులో 2 లక్షల 07 వేల 334 మంది శరణార్థులున్నారు.

క్రమంగా భారత్‌కు విదేశాల నుంచి వలసలు తగ్గిపోతున్నాయి. వలసలు తగ్గిపోయిన దేశాల జాబితాలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. గడిచిన రెండు దశాబ్దాల్లో విదేశాల నుంచి వలసలు అత్యతంగా తగ్గిన దేశాల్లో అర్మేనియా మొదటి స్థానంలో నిలవగా, భారత్‌ రెండో స్థానంలో ఉంది. అర్మేనియా, భారత్, పాకిస్తాన్, ఉక్రెయిన్, టాంజానియా దేశాలకు విదేశీయుల రాక గణనీయంగా తగ్గినట్లు ఐరాస తెలిపింది.

×