మరో నాలుగు నెలల్లో భారత్ లో కరోనా వ్యాక్సిన్

  • Published By: madhu ,Published On : August 13, 2020 / 12:30 PM IST
మరో నాలుగు నెలల్లో భారత్ లో కరోనా వ్యాక్సిన్

కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రష్యా వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చినా..పలువురు సైంటిస్టులు నమ్మడం లేదు. భారత్ లో మాత్రం వ్యాక్సిన్ తెచ్చేందుకు పలు సంస్థలు ప్రయోగాలు జరుపుతూనే ఉన్నాయి.

ఇందులో సీరమ్ ఇనిస్ట్యూట్ ఒకటి. భారత్ లో పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన వ్యాక్సిన్ ను సీరమ్ భారత్ లో పంపిణీ చేయనుంది.

ఈ ఇనిస్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ లో డిసెంబర్ వరకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ మీడియా సంస్థకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థ‌లు క‌లిసి కరోనా వ్యాక్సిన్‌ను త‌యారు చేస్తున్నారు. భార‌త్‌లో కోవిషీల్డ్ పేరిట విక్ర‌యించ‌నున్నారు. ఈ వ్యాక్సిన్ ఒక్క డోసును కేవ‌లం రూ.225 కే విక్ర‌యిస్తామ‌ని పూనావాలా గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.

ఆగస్టు చివరి వరకు ఫేజ్ 2, ఫేజ్ 3 ట్రయల్స్ పూర్తి చేయనున్నారు. తాము ఉత్ప‌త్తి చేసే వ్యాక్సిన్ల‌లలో సగం భారత్ కే ఇస్తామని కూడా ప్రకటించారు. మొత్తం 400 మిలియన్ల కరోనా వ్యాక్సిన్ డోసులను సిద్ధం చేయనుంది.